Tuesday, November 19, 2024

గులాబీ వేడుక.. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్!

టీఆర్‌ఎస్‌ ద్విదశాబ్ది వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరుగుతున్నాయి. హైటెక్స్‌ వేదికగా ప్లీనరీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా మరోసారి కేసీఆర్  ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఈ విషయాన్ని సోమవారం జరిగే పార్టీ ప్లీనరీలో లాంఛనంగా ప్రకటించనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు భవిష్యత్తులో అనుసరించనున్న వైఖరిపై శ్రేణులకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తి అవుతోంది. 2001 ఏప్రిల్‌ 27న కేసీఆర్‌ అధ్యక్షతన 12 మంది ప్రతినిధులతో టీఆర్ఎస్ పార్టీఆవిర్భవించింది. ఆ తర్వాత జరిగిన పలు ప్లీనరీల్లో కేసీఆరే అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మరోసారి ఆయనే అధ్యక్షుడు కానున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా కేసీఆర్‌… ఉపసభాపతి, సిద్దిపేట ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీఆర్ఎస్ ను స్థాపించారు. ఆ తర్వాత ఉద్యమపంథాలోనే పార్టీని నడిపించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి అయ్యారు. 2018 ముందస్తు ఎన్నికల్లో మరోసారి అధికారం చేపట్టారు. గడిచిన ఏడేళ్లుగా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుండగా.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

మరోవైపు ప్లీనరీ సమావేశానికి ఆరు వేల మంది ప్రతినిధులు హాజరవుతారు. ప్రతినిధుల నమోదు కోసం 35 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొదటి సెషన్‌ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌ ఉంటుంది. ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు ఇప్పటికే ప్రత్యేక పాసులు జారీ చేశారు. ప్లీనరీకి రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ ప్రతినిధులు హాజరవుతున్నారు. సభా వేదిక చుట్టూ 8 పార్కింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. టీఆర్‌ఎస్‌ ద్విదశాబ్ది వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలోని ప్రధాన ప్రాంతాలు గులాబీమయంగా మారిపోయాయి. ఎటు చూసినా భారీ సీఎం కేసీఆర్, కేటీఆర్ ల ప్లెక్సీలు, కటౌట్లు, గులాబీ జెండాలే దర్శనమిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: సరిహద్దులో ఎదరుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి

Advertisement

తాజా వార్తలు

Advertisement