Friday, November 22, 2024

కెసిఆర్ మ‌రో స‌రికొత్త ప‌థ‌కం జీవ‌బంధు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని గొర్రెలు, మేకల పెంపకందారులకు ఆర్థికసాధికారత చేకూర్చేందుకు ఇప్పటికే ఉచిత గొర్రెల పంపిణీని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రమాదాల్లో చనిపోయిన పెంపకందారులను ఆదుకునేందుకు సరికొత్త పథకాన్ని ప్రారంభించబోతోంది. కేసీఆర్‌ జీవబంధు గా పేర్కొనే ఈ పథకంతో గొర్రెలు, మేకలు ప్రమాదాల్లో చనిపోతే ఆ బాధిత పెంపకందారుడికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పిల్లలు, పెద్దవి కలిసి దాదాపు2కోట్లకు పైగా గొర్రెలు, 50లక్షల సంఖ్యలో మేకలు ఉన్నాయి. వీటిని పోషిస్తున్న పెంపకందారుల సంఖ్య 7లక్షలా 61వేల895గా నమోదైంది. అయితే మేతకు వెళ్లిన సమయంలో రోడ్డు ప్రమాదాలు, ట్రైన్‌ యాక్సిడెంట్లు, కుక్కలు దాడి, పిడుగు పడడం తదితర ప్రమాదాల్లో ఏటా రాష్ట్ర వ్యాప్తంగా 5వేల నుంచి 6వేల గొర్రెలు మృత్యువాతపడుతున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని రాష్ట్ర గొర్రెలు, మేకల పెంపకందారుల అభివృద్ధి కార్పోరేషన్‌ దూదిమెట్ల బాలరాజుయాదవ్‌ తెలిపారు.

ప్రతి ఏటా రాష్ట్రంలో పలు ప్రమాదాల్లో 2నుంచి 3వేల మంది పెంపకందారులు తమ జీవాలను నష్టపోతున్నారని తేల్చినట్లు చెప్పారు. ఇటీవల ఘటనలనే తీసుకుంటే కొద్ది రోజుల క్రితం మునుగోడు నియోజకవర్గం ఒట్టిపల్లి గ్రామంలో కుక్కల దాడిలో ఒకేసారి 48 గొర్రెలు, మోత్కూరు ప్రాంతంలో కుక్కలదాడిలోనే 98 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. ఇలా ఒకేసారి పెద్ద సంఖ్యలో జీవాలను కోల్పోయిన లబ్దిదారులను ఆర్థికంగా ఆదుకునేందుకే కేసీఆర్‌ జీవ బంధు పేరుతో ప్రత్యేక పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర గొర్రెలు, మేకల పెంపకందారుల అభివృద్ధి కార్పోరేషన్‌ భావిస్తోంది. ఈ పథకం అమలుకు సంబంధించిన అధ్యయన నివేదికను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది కూడా.

ఈ పథకం కింద జీవాల పెంపకందారుల సొసైటీలో సభ్యత్వం ఉన్న పెంపకందారులనే లబ్దిదారులుగా ఎంపిక చేసిన ప్రమాదాలు జరిగినపుడు నష్టపరిహారాన్ని అందిస్తారు. ఈ లెక్కన రాష్ట్రంలో ని యాదవ, కురుమ సొసైటీల్లో సభ్యులుగా 6లక్షలా 61, 895మందికి ఈ పథకం ద్వారా లబ్దిచేకూరనుంది. ప్రమాదంలో జీవాలు మృత్యువా తపడినట్లుగా సంబంధిత ప్రాంతంలోని రెవెన్యూ యంత్రాంగం, పశువైద్యాధికారులు సంయుక్తంగా పంచనామా నిర్వహించాలి.

కేసీఆర్‌ జీవ బంధు పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రాష్ట్ర గొర్రెలు, మేకల పెంపకందారుల అభివృద్ధి కార్పోరేషన్‌ కు కార్పస్‌ ఫండ్‌ కింద రూ.5 కోట్ల నుంచి రూ.10కోట్ల దాకా కేటాయించనుంది. ఈ ఫండ్‌ ను బ్యాంకులో జమ చేస్తే ఏటా రూ.25 లక్షల నుంచి రూ. 50లక్షల దాకా ఇంట్రస్ట్‌ వచ్చే అవకాశం ఉంది. ఆ ఇంట్రస్ట్‌ నిధుల నుండే ఏటా 5వేల గొర్రెలు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నాయనుకున్నా ఒక్కో జీవానికి రూ.5వేల చొప్పున కనీసం 20 గొర్రెల వరకు ఒక లబ్దిదారుడికి ఎక్స్‌గ్రేషియా చెల్లించే అవకాశముందని పథకం అమలుపై జరిపిన అధ్యయన ఫిజబులిటీ నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ నివేదికను పరిగణనలోనికి తీసుకున్న రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు ప్రత్యేక కార్పస్‌ ఫండ్‌ కేటాయింపునకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఫండ్‌ కేటాయింపునకు ఏర్పాట్లు చేయాలని ఆర్థికశాఖ అధికారులను ఆయన ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రానున్న రెండు, మూడు నెలల్లో కేసీఆర్‌ జీవ బంధు పథకం అమలులోకి రానున్నట్లు స్పష్టమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement