హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: ఈ సారి ఎన్నికల్లో తొందరపాటు నిర్ణయాలు, భేషజాలకు పోకుండా బీఆర్‌ఎస్ పక్కా వ్యూహంతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రణాళిక రచిస్తోంది. సిట్టింగ్‌లకు టిక్కెట్ల కేటాయింపు విషయం లోనూ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ముందు కు సాగుతున్నారు. భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడి హోదాలో తాను జాతీయ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించినప్పటికీ, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ద్వారా తన ఆలోచనల అమలుకు శ్రీకారం చుట్టారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో త్రిముఖ పోటీ బలంగా ఉంటుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్న తరుణంలో గెలిచి తీరాలన్న పట్టుదల, తపన, ముఖ్యంగా ఆర్థిక స్థోమత, ప్రజలతో మమేకమయ్యే మన స్థత్వం.. అన్నీ కలగలిపి ఉన్న నాయకులనే బరిలో దింపా లన్న ఆలోచనను తాజాగా వర్కింగ్ ప్రెసిడెంట్‌తో పంచుకు న్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఎక్కడా తన నోటి వెంట టిక్కెట్ల ప్రకటన చేయ కూడదని నిర్ణయించకున్నారు. ఆ బాధ్యతను భుజానెత్తు కున్న మంత్రి కేటీఆర్ తాను హాజరైన కొన్ని సభల్లో స్వయం గా అభ్యర్థుల పేర్లను ప్రకటించడం బీఆర్‌ఎస్ అంతర్గత వ్యూహానికి బలం చేకూరుస్తోంది. అయితే, మెజారిటీ స్థానాల్లో అధినాయకులు ఇద్దరూ కలిసి టిక్కెట్లపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా పెట్టుకున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కొంతకాలం తెరవెనక వ్యూహాత్మకంగా పనిచేసి, ఎన్నికలకు సమయం దగ్గరపడగానే కదనరంగంలోకి దిగాలని నిర్ణ యించుకున్నారు. అంతకు ముందుగానే సీఎం కేసీఆర్ మదిలోంచి వచ్చిన ఆలోచనలకు కేటీఆర్ శ్రీకారం చుట్టబోతున్నారు. వచ్చే ఆరు నెలల పాటు వీరిద్దరు ఎన్నికల అంశంపైనే స్పెషల్ ఫోకస్ పెట్టబోతున్నారు.
టిక్కెట్ల కేటాయింపులో ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తూ ప్రతి నియోజకవర్గంలో రెండు బహిరంగ సభలను నిర్వహించబోతున్నారు. ముందుగా మంత్రి కేటీఆర్ అధ్వర్యంలో జరుగనున్న సభలో స్థానిక నాయకుడికి ఉన్న ప్రజా బలాన్ని అంచనా వేస్తారు. అనంతరం పక్షం రోజుల గ్యాప్‌తో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మరో బహిరంగ సభ ఉంటుంది. విజయంపై అన్ని కోణాల్లో బల నిరూపణ జరిగిన తర్వాతే స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి టిక్కెట్ కేటాయిస్తారు. హ్యాట్రిక్ విజయం సాధించాలంటే జనం నాడి, స్థానిక పరిస్థితుల అంచనా అత్యంత ముఖ్యమన్న విషయాన్ని కేసీఆర్ ముఖ్యనేతలకు పదేపదే చెబుతూ వస్తున్నారు. జూన్ 15 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా గ్రామగ్రామాన బీఆర్‌ఎస్ యువ సమ్మేళనాలు, విద్యార్థి సమ్మేళనాలు నిర్వహించనున్నారు. అనంతరం అధినేత కేసీఆర్ కార్యాచరణ ప్రణాళికను అమల్లోకి తీసుకురావాలని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిర్ణయించారు.
ప్రతిపక్షాలకు ధీటుగా దూకుడు
ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో గత కొంతకాలంగా అన్ని జిల్లాల్లోనూ అధికార పార్టీ బీఆర్‌ఎస్ నాయకులు ప్రతిపక్షాలకు ధీటుగా దూకుడు పెంచారు. తరచుగా పర్యటనలు చేపడుతూ, పార్టీకి ఆదరణ పెంచేందుకు కింది స్థాయి నేతల్లో ఉత్సాహం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్, కేటీ-ఆర్, హరీష్‌రావు వంటి వారు తరచుగా జిల్లాలు పర్యటనలు చేపడుతూ, కీలకమైన ఎన్నికల హామీలను ఇస్తూ, ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ముందుగానే అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ పరిస్థితులు అనుకూలంగా మార్చేందుకు కేటీ-ఆర్ చొరవ తీసుకుంటు-న్నారు.
వివాద రహితులకే ప్రాధాన్యత
ప్రతిపక్ష భాజపా, కాంగ్రెస్ విధానాలను ప్రశ్నిస్తూ ప్రజల్లో చర్చకు పెడుతున్నారు. వివాదాలు లేని నియోజకవర్గాల్లోని అభ్యర్థులను ఖరారు చేస్తూ, వారిని గెలిపించాలని పార్టీ శ్రేణులకు ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఇటీవల కేటీ-ఆర్ జిల్లా పర్యటనలు ఎక్కువగా చేపడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో కౌశిక్‌రెడ్డిని గెలిపించుకోవాలంటూ కేటీ-ఆర్ పిలుపునిచ్చారు. అలాగే హుస్నాబాద్ సభలో మాజీ ఎంపీ వినోద్ వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి అని, బండి సంజయ్‌ను ఇంటికి పంపి వినోద్‌ను గెలిపించాలని కేటీ-ఆర్ పిలుపునిచ్చారు. అలాగే ఎమ్మెల్యే సతీష్ కుమార్‌ను లక్ష ఓట్ల మెజారిటీ-తో గెలిపించాలని కేటీఆర్ కోరారు. వరంగల్‌లో వినయ్ భాస్కర్, కామారెడ్డి జిల్లా జక్కల్‌లో ఎమ్మెల్యే హనుమంత్ షిండే విషయంలోనూ కేటీ-ఆర్ ఇదే విధంగా ప్రకటనలు చేశారు.
కీలక స్థానాలపై జోరుగా చర్చ
కేటీ-ఆర్ జిల్లా పర్యటనల్లో ఈ విధంగా కొన్ని కీలకమైన స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తుండడంపై పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం కేటీ-ఆర్ మౌనంగా ఉండడంతో, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్ దక్కడం లేదనే ప్రచారం జరుగుతుంది. ఆయా నియోజకవర్గాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఆందోళన మొదలైంది. రామగుండం ఎమ్మెల్యే చందర్ గురించి మాట్లాడిన కేటీ-ఆర్ చందర్ మంచి యువకుడు అని, బాగా కష్టపడతాడని, ఉద్యమ కాలం నుంచి పనిచేస్తున్నాడని, ఏవైనా చిన్నచిన్న పొరపాట్లు- ఉంటే మన బిడ్డ అనుకుని కడుపులో పెట్టు-కోవాలని కేటీ-ఆర్ అన్నారు. కానీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ను మరోసారి గెలిపించుకోవాలని చెప్పకపోవడంతో, ఆయనకు టికెట్ దక్కదనే ప్రచారం జరుగుతోంది. ఇక పెద్దపల్లి ఎంపీ బార్లకుంట వెంకటేష్ పేరును కూడా కేటీ-ఆర్ ప్రస్తావించలేదు దీనిపైన కూడా చర్చ జరుగుతోంది. అవినీతి వ్యవహారాలు, గ్రూపు రాజకీయాలతో వివాదాల్లో ఉంటు-న్న వారి విషయంలో సైలెంట్‌గా ఉండడంతో వారికి టిక్కెట్ దక్కదనే ప్రచారం జరుగుతోంది. తాజా పరిణాలమాలతో కేటీ-ఆర్ పర్యటనలపై ఆయా జిల్లాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో -టె-న్షన్ వాతావరణం నెలకొంది.
ఈ ఆర్నెల్లు ఎన్నికలపైనే ఫోకస్..
అసెంబ్లీ ఎన్నికలు నవంబర్, డిసెంబర్ నెలల్లో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాయి. అధికార బీఆర్‌ఎస్ పార్టీ మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో ఉన్నది. సీఎం కేసీఆర్ ఇందుకు సంబంధించిన వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. రాబోయే ఆరు నెలలు పూర్తిగా ఎన్నికలపైనే ఫోకస్ పెట్టనున్నారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై గట్టిగా ఫోకస్ పెట్టారు.