హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో విపక్ష నేతలు అసెంబ్లి లో అడుగుపెట్టకుండా ఓడించడమే ప్రధాన లక్ష్యంగా భారాస వ్యూహాలు సిద్ధమయ్యాయి. గత అసెంబ్లి ఎన్నికల్లో ఎలాగైతే సీనియర్ కాంగ్రెస్, బీజేపీ నేతలను ఇంటికే పరిమితం చేసిందో.. అదే ఫార్ములాను మరోసారి ప్రయత్నిస్తోంది. ఎన్నికలకు సమయం ఉన్నా ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో జనంలో ఉండేలా తీరాల్సిందేనని అధినేత పార్టీ ముఖ్యులకు అల్టిమేటం జారీ చేశారు. అందుకు అనుగుణంగా వ్యూహాలను, అక్కడ ఉన్న స్థానిక సమస్యలతో ప్రజాభిమానాన్ని చురగొనే విధంగా పావులు కదుపుతున్నారు. 20 ఏళ్లలో చేయని అభివృద్ధిని నాలుగేళ్లలో చేసి చూపించామని చెబుతూనే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షాలను దెబ్బకొట్టాలన్న కసితో పార్టీ ముఖ్యులు పని చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాష్ట్రంలో బలహీన పడేలా వ్యూహాలను అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలోని స్థానాలపై ప్రధాన దృష్టి సారించారు. బీజేపీ పార్టీ విషయంలో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో ఖతం చేయాలని చూస్తున్నారు. మిగత జిల్లాల్లో అక్కడ బలంగా ఉన్న నేతలను టార్గెట్‌గా పెట్టుకున్నారు. భారాసకు స్థానికంగా గట్టి పోటీ నిచ్చే సీనియర్ నేతలు, ప్రతిపక్షంగా ఇబ్బంది కలిగించే నేతలు, అనవసరపు ఆరోపణలు చేస్తున్న వారిని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు.
ఆ జిల్లాల్లో వీళ్లే టార్గెట్..
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఒంటి కాలుపై లేచి విమర్శలు చేస్తున్నారన్న వాదన భారాసలో గట్టిగా సాగుతుంటుంది. జిల్లాలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ విజయం సాధించింది. మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలోనే మరోసారి జిల్లాను గులాబీ మయం చేయాలని చూస్తున్నారు. నల్గొండ, హుజూర్‌నగర్, మునుగోడు, నాగార్జున సాగర్ స్థానాల్లో ప్రధాన ప్రత్యర్థులు ఉన్నారు. నల్గొండ నుంచి గతంలో గెలిచిన ప్రస్తుత ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి బరిలోకి దిగబోతున్నారు. ఆయనను 2018 ఎన్నికల్లో ఓడించిన విధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చేతిలో మరోసారి ఓటమి పాలు చేయాలని భారాస కృత నిచ్చయంతో పని చేస్తోంది . తాను చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని భూపాల్ రెడ్డి జనంలోకి వెళ్తున్నారు. 20 ఏళ్లలో కోమటిరెడ్డి ఎందుకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారు అని ప్రశ్నిస్తున్నారు. హుజూర్‌నగర్ నుంచి మాజీ పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగబోతున్నట్లుగా పార్టీ భావిస్తోంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సైదిరెడ్డి చేతిలో ఉత్తమ్‌ను ఓడించాలన్న పట్టుదలతో భారాస పని చేస్తోంది. మంత్రి హరీష్ రావు సైతం సైలెంట్‌గా తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. నాగార్జున సాగర్‌లో మాజీ మంత్రి జానారెడ్డి వచ్చే ఎన్నికలే చివరి సారి అన్న సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రదర్శించబోతున్నట్లుగా గులాబీ అధిష్టానం భావిస్తోంది. జానారెడ్డి బరిలో దిగితే అక్కడ తాము మాత్రం అత్యధిక మెజార్టీతో గెలిచి తీరుతామని భారాస ధీమాను వ్యక్తం చేస్తోంది.
ఓడించడమే లక్ష్యం
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో కొగంగల్ నుంచి బరిలోకి దిగుతానని ఇప్పటికే ప్రకటించారు. అక్కడి నుంచి గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మరోసారి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే చేతిలోనే ఓడించాలని భారాస కృత నిచ్చయంతో పని చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలహీన పరచాలి అంటే రాష్ట్ర అధ్యక్షుడిని ఓడిస్తేనే సాధ్యమవుతుందన్న గట్టి నిర్ణయంతో ఉంది. ఆ దిశగా వ్యూహాలను అమలు చేస్తోంది. సంగారెడ్డిలోనూ గట్టి అభ్యర్థిని బరిలోకి దించాలని చూస్తోంది. వరంగల్ ఈస్ట్, జనగాం, మంచిర్యాల, కొల్హాపూర్, మంథని, జగిత్యాల స్థానాల్లో భారాస గెలవాలి, ప్రత్యర్థులు ఓడాలి అన్న నియమ నిబంధనలతో ముందుకు వెళ్తున్నారు.
కమలం ఖతమే..
తెలంగాణలో అధికార పార్టీకి ప్రత్యర్థుల మంటూ బీజేపీ నేతలు పదే పదే ప్రకటనలు, విమర్శలు, ఆరోపణలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకుగా మారుతున్నారన్న అభిప్రాయాన్ని భారాస నేతలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నామనే తెలంగాణను ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నట్లుగా గులాబీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కరీంనగర్, వేములవాడ, హుజూరాబాద్, హుస్నాబాద్ స్థానాలపై భారాస ప్రత్యేక దృష్టిని సారించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ లేదా వేములవాడ లేదా జిల్లాలోని మరో స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా భావిస్తోంది. ఆయన ఎక్కడ పోటీ చేసిన భారీ మెజార్టీతో భారాస అభ్యర్థి గెలవాలన్న పట్టుదలతో పని చేస్తున్నారు. హుజూరాబాద్‌లో ఈటలను ఓడించే దిశగా కారు నేతలు సిద్ధమయ్యారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌కు ఇప్పటికే నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. దాదాపు ఆయననే బరిలోకి దించబోతున్నట్లుగా చర్చ సాగుతోంది. నిజామాబాద్ అర్బన్ లేదా ఆర్మూర్ నుంచి ఎంపీ అర్వింద్ కుమార్ బరిలోకి దిగే ఛాన్స్ ఉన్నట్లుగా అధిష్టానం భావిస్తుంది. ఇక్కడ కూడా కమలనాథులను ఓడించి గులాబీ జెండా ఎగరవేయాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆ దిశగా క్షేత్రస్థాయి నుంచి పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
అర్బన్‌లోనూ వదలం
గ్రేటర్ హైదరాబాద్‌లోని గోషామహల్, అంబర్‌పేట, ముషీరాబాద్, ఖైరతాబాద్, ఉప్పల్ స్థానాలపై భారాస నజర్ పెట్టింది. గోషామహల్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ప్రస్తుతం బీజేపీలో లేరు. ఆ పార్టీ సస్పెండ్ చేసింది. దీంతో ఈ స్థానంపై భారాస కన్నేసింది. ఇక్కడ పాగా వేసేలా ప్రయత్నిస్తోంది. అంబర్‌పేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తట్టుకొని నిలబడతారా లేదా అన్న సమాలోచనలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలన్న డిమాండ్ స్థానికుల నుంచి పెరుగుతోంది. సిట్టింగ్‌కు తాము సహకరించమని తమలో ఎవరికైనా ఇవ్వాలని కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. టికెట్ రేసులో నియోజకవర్గం ఇంఛార్జ్ ఎడ్ల సుధాకర్, సీనియర్ నేత ఎక్కాల కన్నా యాదవ్ ఉన్నారు. ముషీరాబాద్, ఉప్పల్, ఖైరతాబాద్‌లోనూ సైలెంట్ ఆపరేషన్‌ను గులాబీ చేస్తోంది. మునుగోడు, గద్వాల్, మహబూబ్‌నగర్, దుబ్బాక స్థానాల్లోనూ భారాస నజర్ కొనసాగుతోంది. ఆయా స్థానాల్లో ఆర్థికంగా బలమైన వారే ఉన్నారు. వారందరిని ఓడించి మరోసారి భారాస సత్తా చాటాలని కృత నిచ్చయంతో పని చేస్తోంది.