హైదరాబాద్, ఆంధ్రప్రభ : కర్నాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈ సారి మళ్లి కర్నాటకలో కాషాయపార్టీ పాగా వేస్తే ఆ ప్రభావం దేశమంతా పడుతుందని అందుకే ఆ పార్టీని అక్కడ ఇంటిబాట పట్టించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ముందుగా అనుకున్న ప్రకారం కర్నాటక బరిలో జనతాదళ్ (సెక్యులర్) పార్టీతో కలిసి భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పోటీ చేయాలని అను కున్నప్పటికీ మారిన దేశ రాజకీయ పరిస్థితుల్లో అక్కడ బీజేపీని టార్గెట్ చేస్తూ ఆ పార్టీని ఓడించడమే లక్ష్యంతో రాజకీయం చేయడమే మంచిదని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీని తూలనాడారని రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయ డంతో విపక్ష పార్టీలు కంగుతిన్నాయి. దేశాన్ని దాదాపు 60 ఏళ్లు ఏలిన కాంగ్రెస్ పార్టీ పూర్వ అధ్యక్షుడిపైనే వేటు వేసిన బీజేపీ తమను విడివిడిగా బతకనిస్తాయా అని ప్రాంతీయ పార్టీలు డైలమాలో పడిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ గాంధీకి జరిగిన అన్యాయంపై విపక్షాలు ఏకంకాకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందని ఇటీవల ఢిల్లి సీఎం అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు. అంతేకాదు రాహుల్ తమకు వ్యతిరేకమే కావచ్చు. ఆయనపై పడిన అనర్హత వేటుకు మద్దతుగా విపక్షాలు చేతులు కలపకపోతే చిన్నపార్టీలు మనుగడలేని పరిస్థితి ఏర్పడుతుందని, రాహుల్‌ను కాపాడుకోవాలని కూడా ప్రకటించి సంచలనం సృష్టించారు.
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం రాహుల్‌కు అన్యాయంపై బహిరంగంగా వ్యతిరేకించారు. ఆయనకు మద్దతుగా పార్లమెంట్లో పార్టీ ఎంపీలు ఆందోళనలు చేస్తున్నారు. రాహుల్‌పై అనర్హత వేటు పడిన తర్వాత విపక్ష పార్టీల్లో కదలిక వచ్చింది. ఇప్పటికే ఉన్న బీజేపీ, కాంగ్రెస్ ఫ్రంట్లకు దూరంగా మరో ఫ్రంట్‌గా జతకట్టాలని కాంగ్రెసేతర పార్టీలు అనుకున్నాయి. కానీ, అనర్హత అంశం వారిలో ఐక్యతను తెచ్చింది. కేసీఆర్ కుటుంబంపై కేంద్రం కక్ష గట్టడం, ఆయన కుమార్తె కల్వకుంట్ల కవితను ఢిల్లి లిక్కర్ కేసులో ఇరికించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేంద్రంపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. విభజన చట్టంలో పొందుపర్చిన బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ, కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీని మంజూరు చేయకపోవడం, తెలంగాణకు రావాల్సిన నిధులు మంజూరులో కేంద్రం వివక్ష చూపడంతో బీఆర్ఎస్, బీజేపీ మధ్య అగాధం ఏర్పడింది. కేంద్రం, రాష్ట్రం మధ్య యుద్ధ వాతావరణం పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమే ధ్యేయంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగా తన మిత్రపక్షమైన జనతాదళ్ సెక్యులర్ పోటీ చేసే స్థానాలతో పాటు తెలుగువారు అధికంగా ఉన్న రాయచూరు, బళ్లారి, బీదర్, గుల్బర్గా , బెంగళూరు తదితర ప్రాంతాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశం ఉందని తెలిసింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే బీజేపీ ఓటమి ఖాయంగా సర్వేలు తేల్చాయని, మున్ముందు గెలిచేందుకు బీజేపీ దాని అనుబంధ సంస్థలు ఏ స్థాయికైనా వెళ్లే అవకాశం ఉన్నందున వారి ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు తన పరిధిలో ఉన్న అవకాశాల మేరకు ప్రయత్నిస్తామని పార్టీ నేత ఒకరు చెప్పారు. కేంద్రంలో పార్టీ మారితే తప్ప మంచిరోజులు రావని కేసీఆర్ భావిస్తున్నందున ఆ దిశలో ఆయన కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని అనుకుంటున్నారు.