తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో విపక్ష పార్టీల టార్గెట్ అధికార టీఆర్ఎస్ పార్టీయే. సీఎం కేసీఆర్ పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దుమ్మెత్తి పొస్తుంటే.. మధ్య వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతో వైఎస్ షర్మిల కూడా విమర్శల బాణాలను ఎక్కిపెట్టారు. రోజుకో రకమైన మెలిక పెడుతూ సీఎం కేసీఆర్ ను ఇబ్బంది పెడుతున్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికల రాజకీయంపై షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాదు, తెలంగాణ ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి.
‘’టీఆర్ఎస్ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీ, మా పార్టీ సన్నాసుల మఠం కాదు’’ అని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై రాష్ట్రంలో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాతో హుజురాబాద్ ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికల్లో ఈటలను ఓడించి.. గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం కేసీఆర్.. హుజరాబాద్ నియోజకవర్గానికి వరాల జల్లు కురిపిస్తున్నారు. మంత్రులను రంగంలోకి దించి మరీ హుజురాబాద్ లో అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు దళిత బంధు పథకం పైలెట్ ప్రాజెక్ట్ ను కూడా హుజురాబాద్ నుంచి ప్రారంభిస్తామని చెప్పడంతో ప్రతిపక్ష పార్టీలు సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశాయి. కేవలం ఎన్నికలు ఉన్న సమయంలోనే కేసీఆర్ కు అభివృద్ధి గుర్తొస్తుందా? అని ప్రతిపక్ష పార్టీలు విమర్శలకు పదును పెట్టాయి. ఈ విషయంలో వైఎస్ షర్మిల ఒక అడుగు ముందు వేశారు. షర్మిల ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఏదో ఒక పథకం తీసుకొస్తాము తప్ప .. ప్రజల అభివృద్ధి మాత్రం మాకు పట్టలేదు అని చెప్పినందుకు చాలా సంతోషం సారు అంటూ ఆమె సెటైర్లు వేశారు.
ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటములు సహజం అన్న కేసీఆర్ వ్యాఖ్యలు చూస్తే ఆయనకు హుజురాబాద్ ఉప ఎన్నికలో ఓడిపోతామా? అనే సందేహం వచ్చిందా? అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. హుజురాబాద్ లో సర్వేలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ హుజురాబాద్ పై వరాలు కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచినా ఓడినా ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీలేదు. అయితే, ఈటలను ఓడించేందుకు పథకాలు, నిధులు అంటూ ఒక్క నియోజకవర్గానికే ఇన్ని వేల కోట్లు ఖర్చ చేయడం సర్వత్ర విమర్శలకు తావిస్తోంది.
గతంలో హుజుర్ నగర్, దుబ్బాక, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు పరిశీలిస్తే.. అక్కడ కూడా ఇదే సూత్రాన్ని సీఎం కేసీఆర్ ఫాలో అయ్యారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే.. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం అంటూ హామీలు ఇచ్చారు. ఉప ఎన్నికల సమయంలో మంత్రులు ఆయా నియోజకవర్గాల్లో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఎన్నికల అయిన తర్వాత మరి అక్కడ అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో అక్కడి ప్రజలే చెప్పాలి. ఇప్పుడు హుజురాబాద్ పై సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించడంతో ప్రజలు ఆ హామీని నమ్ముతారా? సీఎం వరాలతో హుజురాబాద్ లో ఓట్లు రాలుతాయా ? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండిః ప్రజలారా మేల్కోండి.. కేసీఆర్ ప్లాన్ పై షర్మిల సెటైర్లు