హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: మూడు ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో విజయం ఏ పార్టీకి కూడా అనుకున్నంత సులువు కాదన్న సర్వే ఆధారిత లెక్కల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) విపక్షాల ఊహకందని మాస్టర్ ప్లాన్‌తో ముందడుగు వేస్తోంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఈసారి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. అడుగుడుగునా కేంద్రంలోని బీజేపీ సర్కార్ వెంటాడుతున్న క్రమంలో, మరింత లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిత్యం సర్కారు లోపాలను ఎత్తి చూపడమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్, అస్త్ర, శస్త్రాలను ఉపయోగించి అధికారం నుంచి దింపాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న జాతీయ పార్టీ బీజేపీలను ఢీకొట్టి మూడోసారి తెలంగాణాను పాలించడం సీఎం కేసీఆర్ చాణిక్యానికి పరీక్షగా రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ తన మేధోశక్తికి మరింత పదును పెడుతున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు కీలక నేతలు ప్రగతిభవన్ వేదికగా సహావేశమయ్యారు. గెలుపే లక్ష్యంగా పట్టుదలతో, ప్రణాళికతో పనిచేసేందుకు ఆర్థిక, అంగబలం, అంతకు మించి రాజకీయ అనుభవం ఉన్న నేతలను ట్రబుల్ షూటర్లుగా నియమించేందుకు అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ప్రతి జిల్లాకు ఒక ట్రబుల్ షూటర్ ఉండాలని, అవసరమైతే నియోజకవర్గాల వారీగా నియమించి రంగంలోకి దింపాలని యోచిస్తున్నారు.
ఆది నుంచీ ఉద్యమ నేపథ్యమున్న హరీష్‌రావు, అకుంటిత దీక్షతో పట్టుకోసం పోరాడుతున్న కేటీఆర్‌లతో అధినేత కేసీఆర్ సమావేశమై త్వరలో జరిగే ఎన్నికల కోసం మార్గనిర్దేశం చేశారు. ఏఏ జిల్లాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏఏ నియోజకవర్గాల్లో ఎవరెవరికి విజయాశకాలున్నా యనే కోణంలో ఈ ముగ్గురు కీలక నేతలు సమాలోచనలు జరిపారు. ఓటమి వైపు చూస్తున్న కొద్దిపాటి నియోజకవర్గాలనూ వదిలిపెట్టకుండా గట్టి పోరాటం చేసేందుకు కొత్త వ్యూహంతో ఎలా ముందుకు వెళ్ళాలో… ఈ సందర్భంగా ఉపదేశమిచ్చారు పెద్దాయన. రాజకీయ బీష్ముడిగా పేరున్న కేసీఆర్ ఎన్ని కుట్రలు, కుత్త్రాలు ఎదురైనా ఈ సారి అధికారం సాధించి తీరాలన్న గట్టి పట్టుదలతో ఉన్నారు.
కేటీఆర్, హరీష్ చెప్పిందే తడువుగా గెలుపు గుర్రాలకు ఓకే..
ఆ నియోజకవర్గాల్లో సిట్టింగులకు ‘సై’ అని చెప్పి ఆటకు రాజముద్ర వేశారాయన. గట్టి పోటీ నెలకొని మెత్తని అభ్యర్థులున్న చోట అధినేత కేసీఆర్ స్వయం పర్యవేక్షణ ఉంటుందని, ఆ స్థానాల్లో ఒకటికి రెండుసార్లు పర్యటించి గెలిపించుకోవాలని ఈ రహస్య సమావేశంలో నిర్ణయించినట్లు ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. వ్యూహం మనదే, దాని అమలూ మనదే.. గెలుపే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గానికి వేర్వేరు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసి సాధ్యమైనంత త్వరలో పంపించాలని నిర్ణయించారు. ఈసారి ఖర్చుకు ఏమాత్రం వెనుకాడేది లేదని భరోసా ఇచ్చిన కొందరు సిట్టింగులను ఎలా ఉపయోగించుకోవాలో కూడా చర్చించారు. పార్టీలో ఉన్న ఆర్థిక సుస్థిరత కలిగిన నాయకులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశంపై కేసీఆర్ త్వరలోనే ఒక విధానపరమైన నిర్ణయాన్ని తీసుకోనున్నారు. సీటు పక్కా అన్న అభ్యర్థులతో త్వరలోనే కేటీఆర్ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ప్రగతి భవన్ ‘అత్యవసరం’ వెనుక అసలు సీక్రెట్ ఇదేనని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
హ్యట్రిక్ విజయం దిశగా బీఆర్‌ఎస్ అడుగులు
ఎన్నికల ఎత్తుగడల్లో పైచేయి సాధించేందుకు, ఆ రెండు ప్రధాన పార్టీల వ్యూహాన్ని దెబ్బతీసేందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సహా హరీష్, కేటీఆర్‌లు ఫ్లయింగ్ స్క్వాడ్‌లా పనిచేయనున్నారు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్ విస్తరణతో పాటు రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయం లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి కొన్ని గంటలపాటు మంత్రులు కేటీ-ఆర్, హరీష్ రావులతో ప్రగతిభవన్‌లో కేసీఆర్ ప్రత్యేక భేటీ జరిగింది. ఈ అత్యవసర సమావేశంలో కొంతసేపటి తర్వాత పార్టీలోని ముఖ్యమైన నాయకులను పిలిపించుకుని విస్తృతంగా చర్చించారు.
కేంద్రం అలజడి సృష్టించే క్రమంలో ఏం చేద్దాం..?
కేసీఆర్ ఇంత హడావుడిగా మీటింగ్ పెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ సమావేశం వివరాలు బయటకు పొక్కనీయలేదు. గురువారం సాయంత్రం ట్రబుల్ షూటర్లంతా మరోసారి సమావేశయ్యారు. ఈ నేపథ్యంలో మూడోసారి అధికారంతో పాటు మరేదో లక్ష్యం కోసం ఈ సమావేశం జరుగుతుందన్నది అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం పథకాలు ఎలా అమలు చేయాలన్న దానిపై చర్చ సాగిందని అనుకుంటు-న్నారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపి రాజకీయ అలజడి సృష్టిస్తున్న క్రమంలో మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందా? అన్న కోణంలో సమాలోచనలు జరుగుతున్నట్లు సీఎం సన్నిహితులు చెబుతున్నారు.
ప్రచార వ్యూహంపైనా బీఆర్‌ఎస్ అత్యున్నత కమిటీ చర్చ
ఎన్నికల ప్రచార వ్యూహంపైనా బీఆర్‌ఎస్ అత్యున్నత కమిటీ చర్చించింది. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వాలి? ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టాలి? అనే దానిపై కూడా చర్చ సాగుతున్నట్లు- తెలుస్తోంది. ఇప్పటికే అమలులో ఉన్న రైతుబంధు, రైతు బీమా, ఆసరా పింఛన్ లాంటి పథకాలపై మార్పులు చేయాలా? లేక వీటి స్థానంలో కొత్తవి తీసుకురావాలా? అనేదానిపై చర్చిస్తారని అంటు-న్నారు. ఇటీ-వల రైతు బంధు పథకాన్ని తీసేసి దాని స్థానంలో రైతులు సంతృప్తి పడేలా కొత్త పథకం తీసుకొస్తారని అంటున్నారు. ఈ విషయం కూడా మీటింగ్‌లో ప్రస్తావన ఉంటు-ందని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం గడువు జనవరి 2024 వరకు ఉంది. అంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ ఉంది.
రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై చర్చ జరిగినట్లు- తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉండేలా దిశానిర్దేశం చేయాలని కేసీఆర్ సూచించినట్టు- సమాచారం. ఏదీఏమైనా కేసీఆర్ మరికొన్ని రహస్య సమావేశాల తర్వాత ఏం చెబుతారోనని పార్టీకి చెందిన ముఖ్య నేతలు, పలువురు సీనియర్ మంత్రులు అత్యంత ఆసక్తితో చూస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం బీఆర్‌ఎస్ హవా ఉన్న నేపథ్యంలో ఇప్పుడే ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్తే మరోసారి అధికారంలోకి వచ్చే చాన్స్ ఉంటు-ందని భావిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ కాంగ్రెస్ ‘హాథ్ సే హాథ్ జోడో’ లాంటి యాత్రలతో ప్రజలకు చేరువవుతున్నాయి. ఇంకా ఆలస్యం చేస్తే మరింత ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అందుకే సమాలోచనలు చేసినట్టు- అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.