హైదరాబాద్, ఆంధ్రప్రభ: పదవ తరగతి పరీక్షా పత్రాల లీకేజీపై సీఎం కేసీఆర్ గుర్రుగా ఉన్నారని సమాచారం. హుటాహుటిన సీఎం కేసీఆర్ మొత్తం వ్యవహారాన్ని ఆరా తీశారని, పోలీస్, విద్యాశాఖ అధికారులతో వ్యవహారంపై వివరాలు సేకరించారని తెలిసింది. పలువురు మంత్రులతో భేటీ అయిన ముఖ్యమంత్రి… బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. హన్మకొండ మెజీస్ట్రేట్ ఎదుట రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు హాజరు పర్చడం, ఆయనకు రిమాండ్ విధించడం, జైలుకు తరలించడం వంటి ఘటనలపై ఆరా తీసిన సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని పలుచన చేసే కుట్రలతోనే బీజేపీ కుయుక్తులకు పాల్పడినట్లుగా నిర్దారణ అయినట్లుగా మంత్రులకు చెప్పినట్లు తెలిసింది. టెన్త్ హిందీ పేపర్‌ను ప్రశాంత్ వైరల్ చేశారని, ఆయనకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారని, ఇదే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించినట్లు తెలిసింది.
ప్రశాంత్, మహేష్‌లు ప్రశ్నాపత్రాన్ని బండి సంజయ్‌కు పంపారని, దీని వెనుక మొత్తం బీజేపీ ఉండి లీకేజీల డ్రామాను నడిపిస్తోందని ఆరోపించినట్లు సమాచారం. ఫోన్ లేదని చెప్పడం వెనుక అనేక అంశాలు ఇమిడి ఉన్నాయని, ప్రజాక్షేత్రంలో బీజేపీ తీరును ఎండగట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. పిల్లల జీవితాలతో రాజకీయాలు చేసే ఎంతటివారైన క్షమార్హులు కారని, దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సీఎం కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పిల్లల జీవితాలతో చెలగాటమాడే రాజకీయాలు ఎవరు చేసినా మంచిది కాదని, ఇటువంటి విపరీత ధోరణులకు అడ్డుకట్ట వేయాలని సూచించినట్లు తెలిసింది. దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షలు పడేలా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. పథకం ప్రకారం పేపర్ల లీకేజీ కుట్రలకు తెగబడిన నేతల భాగోతాలను బైటపెడ్తామని చెప్పినట్లు సమాచారం. పదవ తరగతి విద్యార్ధులు లీకేజీ అంశాలను పక్కనపెట్టి పరీక్షలపై దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం.