హైదరాబాద్, ఆంధ్రప్రభ ముఖ్యప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకో వ్యూహం అమలుచేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యర్థులపై పైచేయి సాధించే వ్యూహాల అమలు ఇప్పటికే మొదలైంది. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో వామపక్షాల బలం గుర్తించిన సీఎం కేసీఆర్ మునుగోడు నుండే దోస్తీ మొదలుపెట్టి తొలి విజయం అందుకున్నారు. కేసీఆర్ మెరుపు వ్యూహం సాధించిన విజయంతో గులాబీశ్రేణుల్లో హర్షం వ్యక్తం కాగా, హ్యాట్రిక్ విజయంపై ఎమ్మెల్యేలు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో సీపీఐ, సీపీఎంల ఓటింగ్ గణనీయంగా ఉండగా.. బీఆర్ఎస్, వామపక్షాలతో పాటు కాంగ్రెస్‌తో కూడా స్థానిక నేతలు ఘర్షణ వైఖరి కొనసాగించడం లేదు. వైరాలో అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్తో కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా కలిసి వెళ్ళారు. ఈసారి ఖమ్మంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభ విజయవంతం కాగా, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వదులుకోవడానికి సిద్దపడి.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును దగ్గరకు తీశారు. త్వరలో తుమ్మలకు ఎమ్మెల్సీ ఇస్తారన్న ప్రచారం జిల్లాలో ఉంది.
ప్రతి నియోజకవర్గంపై సమగ్ర అవగాహన ఉన్న సీఎం కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో తాజాగా సమావేశం నిర్వహించి స్పష్టమైన సూచనలు చేశారు. దీంతో అక్కడి నేతల్లో ఉత్సాహం కనబడుతోంది. ఇక వరంగల్ జిల్లాలో అటు రేవంత్ పాదయాత్ర, షర్మిల పాదయాత్రలపై సీఎంకు నివేదికలు అందగా, ఓరుగల్లులో ములుగుకు సంబంధించి ప్రత్యేక వ్యూహం అమలుచేయాలని సీఎం నిర్ణయించారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్సీలు అసెంబ్లిd నియోజకవర్గాలపై కన్నేశారు. అధిష్టానం ఇప్పటికే కొందరు నేతలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రస్తుతం సనత్‌నగర్ నుండి ప్రాతినిధ్యం వహిస్తుండగా, గోషామహల్ పై కూడా దృష్టిపెట్టారని.. సాయికిరణ్ యాదవ్ కూడా పోటీ చేయబోతున్నారన్న ప్రచారం బీఆర్ఎస్ వర్గాల్లో ఉంది. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఎమ్మెల్సీ పాడి కౌషిక్ రెడ్డికి ఇప్పటికే హుజూరాబాద్‌లో పోటీకి లైన్ క్లియర్ అయింది. రైతుబంధు సమితి అధ్యక్షుడు డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏదైనా ఒక నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి జనగామపై దృష్టిపెట్టారన్న ప్రచారం గతంలో జరిగింది. దీనిని ఆయన ఖండించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈసారి మహేశ్వరం నుండి మరో నియోజకవర్గానికి మారే అవకాశం ఉందన్న ప్రచారాన్ని ఆ పార్టీ నేతలే చేస్తున్నారు. కొందరు యువనేతలు ఈసారి ఎలాగైనా విజయం సాధించి వచ్చే ప్రభుత్వంలో మంత్రులు కావాలన్న లక్ష్యంతో దూకుడు పెంచారు.
పొలిటికల్ వెదర్ పై అలర్ట్
రాష్ట్రంలో ప్రభుత్వపరంగా చేయాల్సిన పనులు పట్టాలెక్కిస్తూనే.. విపక్షాల కదలికలపై కూడా గులాబీ దళపతి దృష్టిపెట్టారు. ఇతర రాష్ట్రాలలో పార్టీ కార్యక్రమాలు, విస్తరణపై వ్యూహరచన చేస్తూనే తెలంగాణలో ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో విక్టరీపై దృష్టి పెట్టారు. విపక్ష నేతల కార్యక్రమాలపై క్షేత్రస్థాయి నుండి నివేదికలు అందుతున్నాయి. బీజేపీ తెలంగాణ వ్యాప్తంగా 11వేల కార్నర్ మీటింగ్‌లు నిర్వహిస్తుండగా, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వరంగల్ , ఖమ్మం జిల్లాల్లో గత పక్షం రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు. హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు మద్దతు ప్రకటించి బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండగా, రానున్నరోజుల్లో ఇది ఆసక్తికర మలుపులకు దారితీసే అవకాశముంది.
ఏప్రిల్‌లో ప్లీనరీ
ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడ్డ సచివాలయ ప్రారంభోత్సవం, జాతీయ నాయకుల సభ ఏప్రిల్‌లో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ఆవిర్భావం కాగా, సాంకేతికంగా పేరు మారినా.. పార్టీ ఆవిర్భావ వేడుక అదేరోజు జరిపే అంశాన్ని అధినేత పరిశీలిస్తున్నారు. ఏప్రిల్‌లో బీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించి, ఈ సందర్భంగా సభకు జాతీయ నేతలను ఆహ్వానించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.