Friday, November 22, 2024

టీఆర్‌ఎస్ ఎంపీలతో కేసీఆర్ భేటీ, ధాన్యం సేకరణపై కేంద్రంఫై ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని దారికి తెచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న కేసీఆర్ సోమవారం ఉదయం తన నివాసంలో పార్టీ పార్లమెంట్ సభ్యులతో సమావేశమయ్యారు. ప్రధానంగా పార్లమెంట్ సమావేశాలపై చర్చ సాగింది. ఉభయ సభల్లో లేవనెత్తాల్సిన అంశాలు, వ్యవహరించాల్సిన తీరుపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత ప్రధాన సమస్య ధాన్యం సేకరణ కాబట్టి ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావడం మీదా చర్చ నడిచింది. ధాన్యం కొనుగోలు సమస్యపై ఆందోళనకు టీఆర్ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి పీయూష్ అపాయింట్‌మెంట్ కోరినా మంగళవారానికి కూడా అపాయింట్‌మెంట్ కన్ఫమ్ అయినట్టు సమాచారమేదీ లేదు. మరోవైపు ఈనెల 11 దేశరాజధానిలో తలపెట్టిన ధర్నాకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణాతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలు రైతు సంఘాలను ధర్నాకు ఆహ్వానించే అవకాశముంది. గత పర్యటనలో బీకేయూ నేత రాకేశ్ తికాయత్‌తో సీఎం చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. మంగళవారం సతీమణి శోభతో పాటు కేసీఆర్ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement