Tuesday, November 26, 2024

రేవంత్ కేక‌తో.. కేసీఆర్‌లో కాక!

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో టీఆర్ఎస్‌ పార్టీకి భారీ నష్టమే జరగనుందా? అంటే ప్రస్తుతం అవుననే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌ రెడ్డి పీసీసీ ప‌గ్గాలు చేత‌బట్టి.. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌పై దండ‌యాత్ర‌కు సిద్ధమవుతున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్‌రెడ్డిని ప్ర‌క‌టించ‌గానే కాంగ్రెస్ శ్రేణులు పండ‌గ చేసుకుంటున్నాయి. కేసీఆర్‌కు ఢీకొట్టే మనగాడు వచ్చాడు అనే నినాదాలు హోరెత్తుతున్నాయి. దీంతో టీఆర్ఎస్ అధినేతకు కొత్త టెన్షన్ మొదలైందట. రేవంత్ కేక‌తో.. కేసీఆర్‌లో కాక పెరుగుతోంద‌ట‌.

ల‌క్ష‌లాది కార్యకర్తలున్న కాంగ్రెస్ పార్టీకి ఒక్క స‌మ‌ర్థుడైన నాయ‌కుడు లేక‌పోవడంతో ఇన్నాళ్లు కేసీఆర్‌ సర్కార్‌ను ధీటుగా ఎదుర్కొలేకపోయింది. గత ఏడేళ్లుగా కాంగ్రెస్ ప‌రిస్థితి అదే. కేసీఆర్‌ను ఢీకొట్ట‌గ‌ల ద‌మ్మున్న లీడ‌ర్ కొర‌త ఆ పార్టీని తీవ్రంగా వేధించింది. మూడున్న‌రేళ్ల‌ క్రితం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువా క‌ప్పుకోవ‌డంతో హ‌స్తం పార్టీకి వెయ్యేనుగుల బ‌లం వ‌చ్చిన‌ట్టైంది. నేడు ఆయ‌న‌కు ఏకంగా పీసీపీ కిరిట‌మే ద‌క్క‌డంతో.. ఇక కేసీఆర్‌కు గద్ద దించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారు. రేవంత్‌ రెడ్డి పీసీసీ చీఫ్ కావ‌డం మాత్రం కేసీఆర్‌కు మింగుడుప‌డ‌ని అంశం. రేవంత్‌ కు పీసీసీ పదవి కాకుండా త‌న కోవ‌ర్టుల‌తో ఎంత‌గా అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించినా.. ఆ ప‌ని గులాబీ బాస్‌ వ‌ల్ల కాలేద‌నే ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. రాష్ట్రంలో మరో పదేళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని గతంలో కేసీఆర్ వ్యాఖ్యానించినా… ప్రస్తుతం సీన్ అందుకు భిన్నంగా ఉంది. దీనికి తోడు పదవుల హామీ ఇచ్చి ఇప్పుడు వాటిని విస్మరించడంతో కొందరు అసంతృప్తి నేతలు రేవంత్ పైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో బీజేపీ బలం పెరుగుతున్నా.. రేవంత్ రాకతో హస్తం పార్టీకి మంచి మైలేజ్ వచ్చింది. బండి సంజయ్ కంటే రేవంత్ రెడ్డి నాయకత్వంపైనే నమ్మకంతో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ప‌లువురు టీఆర్ఎస్ నేత‌లు కాంగ్రెస్ వైపు దృష్టి సారిస్తున్నార‌ట‌. పాత టీడీపీతో పాటు కొత్త టీఆర్ఎస్ నేత‌లు సైతం తాజాగా రేవంత్‌తో ట‌చ్‌లోకి వస్తున్నారని స‌మాచారం.

టీఆర్ఎస్‌లో ఇప్పుడున్న నాయ‌కుల్లో చాలామంది ఒక‌ప్ప‌టి టీడీపీ నేత‌లే. తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగువెలిగిన తెలంగాణ లీడ‌ర్ల‌ను సైకిల్ మీద నుంచి దింపేసి.. కారెక్కించుకున్నారు కేసీఆర్‌. ప్ర‌స్తుతం టీఆర్ఎస్‌లో ఉన్న అప్ప‌టి టీడీపీ నాయ‌కుల‌కు రేవంత్‌రెడ్డి ప‌నిత‌నం, సామ‌ర్థ్యం బాగా తెలుసు. ఇదే ఇప్పుడు కేసీఆర్‌లో క‌ల‌వ‌ర‌పాటుకు కార‌ణం అంటున్నారు. ఒక‌నాడు కేసీఆర్‌ను న‌మ్మి టీడీపీతో స‌హా వివిధ పార్టీల్లోని నేత‌లంతా ఎలాగైతే టీఆర్ఎస్‌లో చేరారో.. ఇప్పుడు అదే ఫార్ములా ప్ర‌కారం రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంపై గురితో టీఆర్ఎస్‌లోని సంతృప్త‌, అసంతృప్తి నాయ‌కులంతా తాజాగా రేవంత్ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి ఎప్ప‌టికైనా సీఎం అవుతార‌నే అంచ‌నాతో.. ఇప్పుడే ఆయ‌న వెంట న‌డిస్తే.. భవిష్యత్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. తమకు మంచి ప‌ద‌వి ఇస్తార‌నే ఆశ‌తో కొందరు గులాబీ నేతలు ఉన్నారట.

తెలంగాణ జిల్లాల్లోనూ టీడీపీకి ఇప్ప‌టికీ చెప్పుకోద‌గ్గ ఓటు బ్యాంకు ఉంది. బీసీల పార్టీగా పేరున్న టీడీపీ అభిమానులు తెలంగాణ‌లో ఊరూరా ఉన్నారు. ఇప్పుడు ఒక‌ప్ప‌టి టీడీపీ నాయ‌కుడైన రేవంత్‌రెడ్డికి స‌పోర్ట‌ర్స్‌గా మారుతున్నారు. ఇక‌, రేవంత్‌రెడ్డికి రెడ్ల స‌పోర్ట్ ఫుల్‌గా ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే కొందరు గులాబీ నేతలు అభిప్రాయపడుతున్నారట. ఈ క్రమంలో ఇప్పుడే పార్టీ మారిపోతే.. తమ పదవులకు డోకా ఉండదని భావిస్తున్నారట. టీటీడీపీని తీవ్రంగా డ్యామేజ్ చేసిన కేసీఆర్‌కు.. నాయ‌కులు, ఓట‌ర్లు క‌లిసి రిట‌ర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీంతో కేసీఆర్ వర్గం కలవరపడుతోందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

- Advertisement -

ఇది కూడా చదవండి: షర్మిల పార్టీ పెట్టగానే పరీక్ష.. పాసవుతుందా?

Advertisement

తాజా వార్తలు

Advertisement