ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 17 (ప్రభన్యూస్): తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆరే బలమని, పేద ప్రజలను అనేక సంక్షేమ పథకాలతో అన్ని విధాలా ఆదుకుంటున్న ఘనత ఆయనకే దక్కుతుందని రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం దుమాల, రాజన్నపేట, దేవుని గుట్ట, బాకురుపల్లి గ్రామాలలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను మంత్రి ప్రారంభించారు. రాజన్నపేట గ్రామంలో రూ. 35లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయ భవన ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంలో నిరంతరం శ్రమించి ప్రజలకు సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూర్చుతున్నామని మంత్రి తెలిపారు. రాజన్నపేట గ్రామంలో రూ.33లక్షలతో మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలలో అదనపు తరగతి గదులు, మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చెస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. రాజన్నపేట గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని విధాల అభివృద్ధి చేశామన్నారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల వివరాలను ప్రజలకు మంత్రి వివరించారు. అభివృద్ధికి నోచుకోని రాజన్నపేటలో వెనుకబాటుతనం ఉందని గుర్తించి, స్వయంగా తానే దత్తత తీసుకుని అభివృద్ధి చేశానన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద కుటుంబాలందరికీ నూతనంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు మంజూరు చేస్తానని మంత్రి తెలిపారు. రాజన్న గ్రామంలో రోడ్ల పక్కన అవసరమైన డైనేజీలను నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తానన్నారు. గ్రామంలో కుట్టు శిక్షణ తీసుకున్న మహిళలకు 90 కుట్టు మిషన్‌లను వారం రోజుల్లోగా అందజేస్తామన్నారు.
సమైక్య రాష్ట్రంలో కరెంట్ ఉంటే వార్త అని, స్వరాష్ట్రంలో కరెంట్ పోతే వార్త అని, 24 గంటల పాటు కరెంట్ ఇస్తుంది తెలంగాణ రాష్ట్రం మాత్రమేనన్నారు. ప్రపంచంలో ఎక్కడా రైతు భీమా పథకం లేదన్నారు. ప్రమాదవశాత్తూ రైతు చనిపోతే రూ.5 లక్షల భీమాతో రైతు కుటుబాన్ని ఆదుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు ఒక లక్ష మంది రైతు కుటుంబాలకు రూ.5 వేల కోట్ల ఆర్థిక సహాయం అందజేసినట్లు మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో బీడీ కార్మికులకు పెన్షన్ లు ఇస్తున్న ప్రభుత్వం కూడా కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. మనసున్న నాయకుడు కేసీఆర్ కనుకనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజలకు అన్ని విధాలా లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. రాష్ట్రంలో 3400 తండాలను గ్రామ పంచాయితీలుగా మార్చిన ఘనత కూడా కేసీఆర్‌దేనన్నారు. ఇంత అభివృద్ధి 68 ఏళ్లలో ఏ ప్రభుత్వాలు చేయలేదని, అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. వారి పాలనలో అభివృద్ధి ఎందుకు చేయలేదనీ మంత్రి ప్రశ్నించారు. సీఎంఆర్‌ఎఫ్ పథకం ద్వారా ఒక్క రాజన్నపేటకు రూ.45.25 లక్షల ఆర్థిక సహాయం అందించామని మంత్రి తెలిపారు. 2014 సంవత్సరం నుండి ఇప్పటి వరకూ ఒక్క రాజన్నపేట గ్రామంలోనే రూ.20 కోట్ల 38 లక్షల అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేసినట్లు మంత్రి చెప్పారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకం అందకుంటే తప్పకుండా వారికి కూడా అందేలా చూస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. అభివృద్ది, సంక్షేమంలో సిఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ దేశంలోనే దూసుకుపోతుందన్నారు. దేశంలో ఉన్న ఆదర్శ గ్రామాల్లో అధి క గ్రామాలు తెలంగాణలోనివేనన్నారు. ఈకార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు, జెడ్‌పి చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, చేనేత, జౌళి శాఖ కార్పొరేషన్ చైమెన్ గూడూరి ప్రవీణ్, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్‌పి అఖిల్ మహాజన్, ఎంపిపి పిల్లి రేణుక కిషన్, జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్‌రావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, వివిధ శాఖల అధికారులు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.