ఖమ్మం : రానున్న ఎన్నికల ద్వారా రాష్ట్రంలో మూడోసారి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయంతో ముఖ్యమంత్రి కానున్నారని, అందుకు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం స్ఫూర్తిగా నిలవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆదేశాల మేరకు ఖమ్మం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో రాష్ట్రంలోనే మొదటి సారిగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఖమ్మం కార్పోరేషన్ లోని 16 డివిజన్లతో సీక్వెల్ ఫంక్షన్ హాల్ నందు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లతో వన్ టౌన్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా BRS జిల్లా ఇంఛార్జి శేరి సుభాష్ రెడ్డి , ఎమ్మెల్సీ, BRS జిల్లా అధ్యక్షులు తాత మధు, ఎంపి నామా నాగేశ్వరరావు, జెడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్ పాల్గొని మాట్లాడారు. అనంతరం మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే తొలిసారిగా ఖమ్మం నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి, పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపి మరింత చైతన్య పరిచేందుకు పార్టీ అధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
తనకు BRS పార్టీ ద్వారా మీలాంటి వేల మంది కుటుంబాన్ని అందించిన ముఖ్యమంత్రి కేసీఅర్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. అన్నిటి కంటే ముఖ్యంగా నియోజకవర్గం మొత్తం ఇలానే ప్రతి కార్యకర్త పేరుపెట్టి పిలిచే జ్ఞాపకశక్తిని నాకు జీవితాంతం దేవుడు ఇలాగే ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానన్నారు. పార్టీకి కార్యకర్తలే శ్రీరామ రక్ష అని ఆత్మీయ సమ్మేళనాలు నాయకులు, కార్యకర్తల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేస్తాయన్నారు.
ఖమ్మం నా ఇల్లు.. ప్రజలు నా కుటుంబ సభ్యులు అంటూ వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నుండి ప్రతి సంక్షేమం, అభివృధ్ధిని వారికి చేరువ చేయాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు. ఇప్పటి వరకు ఖమ్మం నియోజకవర్గంలో ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని ప్రతి ఇంటికి మీ ద్వారా చేర్చగలిగామని వివరించారు. దళిత బంధు పథకాన్ని క్షేత్ర స్థాయిలో అందరికీ అందిస్తామని, గడచిన రెండేళ్లలో నియోజకవర్గంలోనే 2500 ఇళ్లు ఇచ్చామని, ఇంకా మరిన్ని ఇస్తామన్నారు. తనను ఖమ్మం ప్రజలందరి వాడుగా చూసుకుంటారని, మైనారిటీలు ప్రేమతో అజయ్ ఖాన్ గా పిలుచుకుంటారనీ, క్రైస్తవులు ప్రభువు బిడ్డగా ఆత్మీయంగా చూసుకుంటారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని, అందుకు కార్యకర్తలే ప్రధాన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
గత ఖమ్మంను నేటి ఖమ్మంతో పోల్చి చూడండి, ఒకప్పుడు ఖమ్మం నగరంలో త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతూ నిత్యం రోడ్ల మీద త్రాగునీటి ట్యాంకర్ లతో గల గల నడిచిన నాటి రోజులు ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు. నేడు ఎక్కడైనా వాటర్ ట్యాంకర్ లు కనబడుతున్నాయా అని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి శుద్ధమైన త్రాగునీరు అందిస్తున్నామని, నిజమా కాదా ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఖమ్మంలో కులాలు, మతాల మధ్య విద్వేషాలు రగిల్చి చిచ్చు పెట్టాలని ప్రయత్నాలు చేసేందుకు కొందరు వస్తారన్నారు. జాతీయ పార్టీలు వాటికున్న బూజులు దులుపుకుని రోడ్లు ఎక్కుతున్నారని ప్రజలు తస్మాత్ జాగ్రత్త అని సూచించారు. తనకు ఇక్కడే ఓటు ఉంది, ఇక్కడే చదివినా.. ఇక్కడే ఉన్నా, ఇక్కడే తిరిగిన, నా బతుకు ఇక్కడే.. నా చావు కూడా ఇక్కడే అని కార్యకర్తలు, నాయకుల హర్షద్వానాల మధ్య స్పష్టం చేశారు.
ఇక్కడ ఓటు లేనోల్లు కూడా డాబులకు మాట్లాడుతారని, ఏం అర్హత ఉందో తెలియక కేసీఅర్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం అని తాటాకు చప్పుళ్ళు చేస్తూ, అవాకులు చవాకులు పేలుతున్నారని అన్నారు. నీ ఉడత ఊపుడుకి భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరని, అక్కడ ఉన్నది కేసీఅర్ అని అది గుర్తుంచుకుని ప్రవర్తిస్తే మంచిదని హితువు పలికారు. కర్ణాటి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో పాటు డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, జిల్లా నాయకులు ఆర్ జె సి కృష్ణ, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, ఖమ్మం నగర బిఆర్ఎస్ అధ్యక్షుడు పగడాల నాగరాజు, కమర్తపు మురళి, కర్ణాటి కృష్ణ, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దోరేపల్లి శ్వేత, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లక్ష్మీప్రసన్న సాయికిరణ్, మైనార్టీ నాయకులు ఖమర్ , తాజుద్దీన్, ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.