తన తండ్రి దేవెగౌడ తర్వాత అంతటి మార్గదర్శి సీఎం కేసీఆరేనని చెప్పారు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి. కేసీఆర్ ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు కుమారస్వామి హాజరుకాకపోవడం అందరిలో అనేక అనుమానాలను రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య ఏదో గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరిగింది. ఈ వార్తలపై తాజాగా కుమారస్వామి స్పందిస్తూ ఊహాగానాలను కొట్టిపారేశారు. కర్ణాటక రాయచూర్ లో జరిగిన పంచరత్న యాత్రలో నారాయణపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో కలిసి కుమారస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మిషన్ భగీరథ పథకంతో తెలంగాణలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగు నీరు లభిస్తోందన్నారు. కర్ణాటకలో తాము అధికారంలోకి వస్తే కేసీఆర్ స్ఫూర్తితో పథకాలను అమలు చేస్తామని తెలిపారు. మరోవైపు ఈనెల 17న తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభం రోజున బీఆర్ఎస్ పార్టీ భారీ సభను నిర్వహించనుంది. ఈ సభకు తమిళనాడు, ఝార్ఖండ్ సీఎంలు స్టాలిన్, హేమంత్ సొరేన్ లతో పాటు మరికొందరు నేతలు హాజరుకానున్నారు. ఈ సభకు కుమారస్వామి, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ తదితర నేతలు హాజరుకానున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement