– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
2024 పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) వ్యవస్థాపకుడు కె. చంద్రశేఖర రావు బుధవారం పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చారు. కేంద్రంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర పక్షాలకు ఇప్పుడు కేసీఆర్ సెంటర్ ఆఫ్ అట్రక్షన్ అయ్యారు. దేశాన్ని కాపాడే క్రమంలో హైదరాబాద్‌లో జరిగిన ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చాలని తీర్మానం చేశారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు ‘దేశ్ కా నేత కేసీఆర్’, ‘డియర్ ఇండియా.. కేసీఆర్ వస్తున్నారు’అంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున సంబురాలు చేశారు.
కాగా, రెండు దశాబ్దాల క్రితం అంటే 2001లో టీఆర్‌ఎస్ ఒకే ఎజెండాతో ప్రారంభమైంది. ఉద్యమ పార్టీగా మొదలై..- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ లక్ష్యంగా ఆ పార్టీ పురుడు పోసుకుంది. ఆ తర్వాత 2014లో ఆ లక్ష్యాన్ని సాధించి రాజకీయ పార్టీగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంది. దీనికంతటికీ కేసీఆర్ రాజకీయ చతురత.. మాటకారి తనం, ప్రజల నాడీ పట్టుకున్న ఓ పొలిటికల్ డాక్టర్‌గా ఆయనకున్న ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే టీఆర్‌ఎస్ కాస్త లో అవుతుందన్న మాట వినిపిస్తుందో.. అప్పుడు ప్రజల్లో మళ్లీ ఉద్వేగాలను సజీవంగా ఉంచి.. బెస్ట్ మైలేజ్ వచ్చేలా చేసుకోవడం కేసీఆర్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియదన్నది వాస్తవం.
ఇక.. పార్టీ పేరును మార్చడం ద్వారా, జాతీయ స్థాయికి వెళ్లాలని తన ఉద్దేశాన్ని ప్రకటించడం ద్వారా కేసీఆర్ 2024 సార్వత్రిక ఎన్నికల రేసుకు టైమ్ సెట్ చేసుకున్నట్టు అయ్యింది. తదుపరి రాబోయే పన్నెండు నెలలు కీలక సమయం కానుంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పనితీరు, సాంప్రదాయేతర ప్రతిపక్షంగా మారడానికి ప్రాంతీయ పార్టీల సహకారం అందుతుందా లేదా అనేది కచ్చితంగా తేలిపోతుంది.
నాన్-కాంగ్రెస్, నాన్-బీజేపీ అపోజిషన్..
వ్యక్తిగతంగా చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో తమ సత్తా చాటుకునే అవకాశం రావడం లేదని, కానీ, సమిష్టిగా ఉండడం ద్వారా కేంద్రంలో గతాన్ని తిరగరాసే అవకాశం ఉందని కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు. దీంతో ప్రాంతీయ పార్టీలన్నీ కలిసికట్టుగా ఉంటే కచ్చితంగా విజయం సాధించవచ్చనే ఫార్ములాతో ముందడుగు వేశారు. అందుకని బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రతిపక్షం కోసం తన ప్రయత్నంలో కేసీఆర్ ఈ మధ్య హెచ్‌డీ దేవెగౌడ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, నితీష్ కుమార్‌తో సహా పలువురు ప్రాంతీయ పార్టీ నాయకులు.. రాష్ట్ర ముఖ్యమంత్రులను కలిశారు. ఇక.. బీజేపీకి సవాల్ విసిరేందుకు కేంద్రంలోని విపక్షాల శూన్యతను భర్తీ చేయాలన్నది కేసీఆర్ ఆశయం. పార్టీ పేరు మార్చడం తొలి అడుగు అయితే.. బీజేపీకి అపారమైన పట్టు ఉన్న ఉత్తరాదిలో పాగా వేసి పట్టు సాధిస్తే అనుకున్నది ఈజీగా సాధించవచ్చంటున్నారు అనలిస్టులు.
ఓటు బ్యాంకును కాపాడుకోవడం..
వివిధ సంక్షేమ పథకాలతో మహిళలు, రైతులు, బడుగు బలహీన వర్గాల మద్దతును గెలుచుకోవడంలో తమ పార్టీ సాధించిన విజయాన్ని జాతీయ స్థాయిలో ప్రతిబింబించవచ్చని తెలంగాణ సీఎం కేసీఆర్ విశ్వసిస్తున్నారు. 2020-2021 రైతు ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన ఢిల్లీ, పంజాబ్‌లోని రైతు కుటుంబాలకు, బంధువులకు ఆర్థికంగా సహాయం చేయడం ద్వారా తనను తాను రైతు అనుకూల నాయకుడిగా నిరూపించుకున్నారు. దేశంలో 14 శాతం ముస్లిం ఓటు బ్యాంకు ఉన్నందున ముస్లిం అనుకూల కోణం కూడా కలిసి వచ్చే అంశం కానుంది. AIMIM, దాని అధినేత అసస్దుద్దీన్ ఒవైసీతో సన్నిహితంగా మెలుగుతుండడంతో కేసీఆర్ ముస్లిం అనుకూల నాయకుడిగా పేరుగాంచారు. ఆయన మంత్రివర్గంలోని పలువురు మంత్రులు కూడా ముస్లింలు ఉండడం గమనార్హం.
కీలకం కానున్న తెలంగాణ 2023 ఎన్నికలు..
గతంలో కేంద్రంలో అధికారం చేపట్టేందుకు పలు ప్రాంతీయ పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. ప్రస్తుతం వేరే ఇతర లీడర్లెవరూ ఫోకస్ కావడం లేదు. అందుకని కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనతో ఇప్పుడు సెంటర్ పాయింట్‌గా మారారు. తెలంగాణలో 2023లో ఎన్నికలకు వెళ్లనున్న విషయాన్ని కూడా అనలిస్టులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో దూకుడుగా ప్రచారం చేస్తున్న బీజేపీని.. భారత్ రాష్ట్ర సమితి ఓడించగలిగితే, కాషాయదళానికి వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షంగా తనను తాను ప్రదర్శించుకోవడానికి కేసీఆర్ ఆ విజయాన్ని ఆమోదయోగ్యంగా ఉపయోగించుకునే చాన్స్ ఉంది. జాతీయ స్థాయిలో పార్టీ, ప్రధానమంత్రి పదవికి అప్పుడు గట్టి పోటీదారు అవుతాడన్న వాదన వినిపిస్తోంది.