సీఎం కేసీఆర్ పట్ల ప్రజలకు విముఖత ఉందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఇవ్వాల ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్ నెత్తిన శని ఉంది. అది గుంజకపోతాంది. దాన్నించి బయటపడాలని, నిర్మాణం చేసుకోవాలి అని చూస్తున్నారు.. కానీ, కూలిపోతుంది. ఇకనైనా దిగిరా.. ప్రజలకు విశ్వాసం కల్పించు. ఇదే మా భాష అని తెలంగాణను కించపరచకు’’ అన్నారు ఈటల రాజేందర్.
రాష్ట్రంలోని దళితులందరికీ వెంటనే దళితబంధు డబ్బులివ్వాలని కోరారు. దళితులను మోసం, వంచన చేయవద్దని సూచించారు. మద్యం అమ్మడానికి కలెక్టర్లకి టార్గెట్ పెట్టి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మానిటర్ చేసే పరిస్థితి ఉందంటే.. ఎటుపోతున్నం కేసీఆర్ గారు అని వ్యంగంగా విమర్శలు చేశారు. జనాలకు మద్యం తాగించి ఆడపిల్లల పుస్తెలు తెంపి సంపాదిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఉద్యోగుల విషయాన్ని లేవనెత్తుతూ.. ‘‘ఆంధ్రలో నేల ఈనిందా అన్నట్టు ధర్నా చేశారు. కేసీఆర్ నువ్వు కూడా ఎన్ని రోజులు బెదిరించి ఉద్యోగులను ఆపుతవు. కట్టలు తెంచుకున్న నాడు ఎవరూ ఆపలేరు’’ అని ఏపీ ఉద్యోగుల ఆందోళనను ఉదహరించారు. ‘‘ఈటల అమాయుకుడే కావొచ్చు కానీ, ఉద్యమ బిడ్డ అని మర్చిపోవద్దు. భూమి ఆకాశం ఒకటి చేస్తా.. పేదవారికి నష్టం జరిగితే ఊరుకునేది లేదు” అని హెచ్చరించారు ఈటల రాజేందర్.