– వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ
బీఆర్ఎస్ లీడర్లు తమ అధినేత ప్రకటించబోయే మేనిఫెస్టోని ఓ గేమ్ ఛేంజర్ గా అభివర్ణిస్తున్నారు. ఇది ప్రతిపక్షాలకు అతిపెద్ద షాకిస్తుందని భావిస్తున్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆవిష్కరించనున్న ఈ మేనిఫెస్టోపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీంతో పాటు పార్టీ తన అభ్యర్థులకు బి-ఫారాలను కూడా అందించనుంది. రానున్న ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించడం, ముఖ్యంగా రైతు రుణమాఫీ వంటి హామీలను పరిగణనలోకి తీసుకుని ఈ మేనిఫెస్టో రూపకల్పనలో కేసీఆర్ గణనీయమైన కృషి చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాగా, హుస్నాబాద్ వేదికగా ఇవ్వాల (ఆదివారం) ఎన్నికల ప్రచారాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎన్నికల ప్రచార రథం సిద్దమైంది. తాజాగా విడుదల చేసిన ఫొటోల్లో అధినేత చిత్రం, కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగు గుభాళింపుతో సర్వాంగ సుందరంగా బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార కనిపిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ దీన్ని నజరానాగా అందించినట్టు తెలుస్తోంది.
ఇక.. కొద్ది రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్ నుంచి తెలంగాణాకు ఈ వాహనం చేరుకుంది. ఆదివారం నుంచి నుంచి మొదలయ్యే కేసీఆర్ ప్రచార పర్వంలో తెలంగాణ రోడ్లపై ఈ ప్రచార రథం పరుగులు పెట్టనుంది. ఇవాళ హుస్నాబాదుకు ప్రచార రథం చేరుకుంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కేసీఆర్ తో పాటు స్టార్ క్యాంపెయినర్లుగా సీనియర్ నేతల జాబితాను కూడా సిద్ధం చేసి ఎన్నికల భారాన్ని పంచుకుంటున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన సొంత సిరిసిల్లతో పాటు ఈసారి పోటీకి రెండో నియోజకవర్గంగా పార్టీ అధినేత ఎంపిక చేసిన హైదరాబాద్ (జీహెచ్ఎంసీ), కామారెడ్డి నియోజకవర్గాల బాధ్యతలను నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ మరో అగ్రనాయకుడు హరీష్ రావు సైతం ఎన్నికల ప్రచారం కీలక బాధ్యలు నిర్వర్తిస్తున్నారు.