హైదరాబాద్ – అత్యాధునిక వసతులతో నిర్మించిన రాష్ట్ర పరిపాలనా సౌధం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని నేటి మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాలకు సింహలగ్న ముహుర్తంలో సీఎం కెసిఆర్ ప్రారంభించారు. సచివాలయ ప్రధాన ద్వారాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన అనంతరం అదే సమయానికి మంత్రులంతా ఎవరికివారు తమతమ కార్యాలయాలను ప్రారంభించుకున్నారు.. అలాగే . అధికారులు కూడా తమ తమ శాఖల కార్యాలయాల్లో ఆసీనులయ్యారు.. మంత్రులు, అధికారులు నేడు సాధారణ పరిపాలనా కార్యక్రమాలకు కొత్త సచివాలయం నుంచి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్ల కేటాయింపునకు సంబంధించిన మార్గదర్శకాల పంపిణీపై పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ఆదివారం నూతన సచివాలయంలో తొలి సంతకం చేశారు.. దీంతో హైదరాబాద్‌లో లక్ష మంది పేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లను పంపిణీ చేసే కార్యక్రమానికి మార్గం సుగమం అయింది..
కాగా, ఆరో అంతస్థులో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటైంది. పూర్తిగా తెల్లటి మార్బుల్‌తో ముఖ్యమంత్రి కార్యాలయం, ఆయన సిబ్బందికి ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ప్రజలను కలిసేందుకు, ప్రజాదర్బారు నిర్వహించేందుకు జనహిత పేరిట కనీసం 250 మంది కూర్చునేలా ఒక హాలును ఏర్పాటు చేశారు. 25 మంది మంత్రులు, 30 మందికి పైగా అధికారులు కూర్చునేందుకు వీలుగా క్యాబినెట్ హాలును సిద్ధం చేశారు. కలెక్టర్లతో సమావేశాల నిర్వహణ కోసం 60 మంది కూర్చునేలా ఒక హాలు, 50 మంది సమావేశమయ్యేందుకు మరో హాలును నిర్మించారు. ఈ నాలుగు మందిరాలతో పాటు ముఖ్యమంత్రి విశిష్ట అతిథులతో కలిసి భోజనం చేసేందుకు.. సుమారు 25 మంది ఆసీనులయ్యేలా అత్యాధునిక డైనింగ్ హాలును ఏర్పాటు చేశారు.