హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఈ దేశం మనందరిది.., ప్రస్తుతం ఆగమ్య గోచర పరిస్థితుల్లో పయనిస్తోం ది.., మార్చాల్సిన అవసరం ఉంది… మార్పు కోసం.., ఉజ్వల భారతదేశం కోసం చివరి రక్తపు బొట్టువరకు పోరాడుతానని, లక్ష్యం చేరుకోవడం తథ్యం అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దేవుని సన్నిధిని చేరుకోవడం ఆలస్యం కావచ్చు.., కానీ చేరుకోవడం తథ్యం (అల్లా కే ఘర్ మే దేర్ హై… లేకిన్ అంధేర్ నహీ) అని భక్తుల హర్షధ్వానాల మధ్య కేసీఆర్ వ్యాఖ్యానించారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున బుధవారం ఎల్‌బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సంద ర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ దేశం అందరిది.. మనం ముందుకు సాగుదాం.., ఈ దేశాన్నిసురక్షితంగా కాపాడుకుందామనీ, ఈ ప్రయాణంలో రాజీపడే ప్రసక్తిలేదని కేసీఆర్ తేల్చిచెప్పారు. గంగా జమున తెహజీబ్ సంస్కృతి, సంప్రదాయాలను ఆచార వ్యవహారాలను ఎవరు కూడా మార్చలేరనీ, అలా ప్రయత్నించిన వారు అంతంకాక తప్పదని హెచ్చరించారు. కానీ, దేశం ఎన్నటికీ నిలిచి ఉంటుందని, తన మాటలపై నమ్మకం ఉంచాలని కోరారు. సమయం వచ్చినప్పుడు దేశాన్ని రక్షించుకోవడానికి శక్తిని కాకుండా యుక్తిని ప్రయోగించాలని, దేశాన్ని రక్షించుకునేందుకు ముందుకు రావాలని పెద్దలకు, యువతకు అందరికి కేసీఆర్ పిలుపునిచ్చారు.
చిన్నచిన్న కష్టాలు వస్తుంటాయని, మీ అందరి సహకారం ఉంటే చివరి వరకు పోరాడుతూనే ఉందామని కోరారు. ఇది తాత్కాలిక దశ, ఈ సమయంలో ఒనగూరేదేమి ఉండదు.., తుదకు న్యాయమే గెలుస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను మార్చేందుకే తాను దేశ రాజకీయాల్లోకి ప్రవేశించినట్లు చెప్పారు. ఆ క్రమంలోనే మహారాష్ట్ర ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీకి ఘనంగా స్వాగతం పలుకుతున్నారని, తన అంచనాలకు మించి ప్రజాదరణ లభిస్తోందన్నారు. ఈ దేశం సరైన నాయకుని కోసం, పార్టీ కోసం వేచి చూస్తున్నదనే విషయం స్పష్టమైందన్నారు.
అల్లా దయతో దేశంలోనే పోటీలేని రాష్ట్రంగా ఎదిగాం…
తొమ్మిదేళ్ల క్రితం తెలంగాణ ప్రజలను వెనుకబడిన వారుగా పరిగణించే వారని, అల్లా దయతో, అందరి ప్రార్థనలతో తెలంగాణ రాష్ట్రానికి దేశంలో పోటీ అనేదే లేదని, ఇది తాను చెబుతున్న విషయం కాదని, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిందని సీఎం చెప్పారు. దేశంలోనే మరే రాష్ట్రానికి లేని విధంగా తెలంగాణ తలసరి ఆదాయం రూ. 3,17,115 కోట్లు అని, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, కర్ణాటకల కంటె కూడా తెలంగాణ ముందంజలో ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రం ఎర్పడిన కొత్తలో తలసరి విద్యుత్ వినియోగం 1000నుంచి 1050 యూనిట్ల వరకు ఉండేదని, ప్రస్తుతం అది 2100 యూనిట్లకు పెరిగి దేశంలోనే అత్యున్నత స్థానంలో నిలిచామని చెప్పారు. పరిశ్రమలు, ఐటీ రంగంలో పురోగమిస్తున్న తీరును అందరు కూడా గమనిస్తున్నారని అన్నారు. అసదుద్దీన్ తదితరుల కోరిన మేరకు అనీస్ ఉల్ గుర్బాను అత్యద్భుతంగా నిర్మించుకున్నామని చెప్పారు. బీఆర్‌ఎస్‌కు పూర్వం ఈ ప్రాంతాన్ని కోంగ్రెస్పార్టీ 10 సంవత్సరాల పాటు పాలిచింందని, ఈ పదేళ్ళకాలంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం కేవలం రూ.12 వందల కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే, తమ ప్రభుత్వుం అధికారంలోకి వచ్చిన పదేళ్ళ కాలంలో రూ.12 వేల కోట్లు ఖర్చు చేసినట్లు ప్రజల హర్షధ్వానాల మధ్య సీఎం వెల్లడించారు.
తాను చెబుతున్న గణాంకాలు కంఎ్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వెల్లడించిన విషయాలని సీఎం పేర్కొన్నారు. గతంలో లాగా రైతుల ఆత్మహత్యలు ఇప్పుడు రాష్ట్రంలో లేవని, జీవన పోరాటంలో భాగంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన రైతులు తిరిగి తమ ఊర్లకు చేరుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 94 లక్షల ఎకరాల్లో వరి పంటను పండించుకుంటున్నామని, ఈ విషయాన్ని గర్వంతో చెబుతున్నానని పేర్కొన్నారు. మొత్తం దేశంలో సాగుచేసిన 66 లక్షల 40 వేల ఎకరాల్లో మాత్రమే వరి సాగు విస్తీర్ణముందని ఇది తెలంగాణలో పండించిన వరి విస్తీర్ణం కంటె చాలా తక్కువని కేసీఆర్ విశ్లేషించారు. తాగునీరు, విద్యుత్ సమస్యలు లేనేలేవని, నిరుద్యోగ సమస్యను మెల్లమెల్లగా పరిష్కరించుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రం ముందుకు సాగుతోందని, కానీ, దేశం వెనుకబడుతోందని, ఈ విషయం చెప్పేందుకు తానేమీ ఇబ్బంది పడటం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం మాదిరిగా కేంద్రం శ్రమిస్తే దేశ జీడీపీ కనీసం మరో 3 లక్షల నుంచి 4 లక్షలకు పెరిగేదని చెప్పారు. ఈ విషయంలో దేశం చాలా దెబతిన్నదని విమర్శించారు.
అనాధ పిల్లలతో సీఎం ముచ్చట…
ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు ఎల్బీ స్టేడియంకు వచ్చిన సీఎం కేసీఆర్ తొలుత అనీస్ ఉల్ గుర్భాలో ఆశ్రయం పొందుతున్న అనాధ పిల్లలతో కలిసి కొద్ది సేపు ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలు ఆంగ్లంలో మాట్లాడడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం ముస్లిం మత పెద్దలను కలిసి వారి ఆశీర్వచనాలు తీసుకున్నారు. తొలుత మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు మజ్లిస్ ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బేతి సుభాష్ రెడ్డి, కాలేరు వెంకటేష్, సీఎం సెక్రెటరీ భూపాల్ రెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీం, కమిషనర్ షఫీ ఉల్లా, సలహాదారు ఎకే ఖాన్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏకే ఖాన్ సీఎంకు జ్ఞాపికను బహూకరించగా, మహమూద్ అలీ టోపీని ధరింపజేశారు. ఆ తర్వాత ప్రముఖులతో సీఎం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.