Friday, November 22, 2024

సర్వజన హితంగా కెసిఆర్ అడుగులు …రెండు కోట్ల మందికి కొత్త ఆశ‌లు..

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌ : సర్వజన హితం ఎజెండాగా బీఆర్‌ఎస్‌ పార్టీ కసరత్తు మొదలు పెట్టింది. ఎన్నికల ఏడాదిలో ప్రజా సమస్యలకు చరమగీతం పాడి వీలైనంత ఎక్కువమంది ప్రజానీకానికి ప్రయోజనం కల్గించేందుకు ఉన్న అన్ని మార్గాలను పరిశీలించి పరిష్కారం దిశగా సమాయత్తమవుతున్నది. ఇందులో నేరుగా ప్రజలకు లబ్ది జరిగేందుకు ఉన్న విస్తృత అవకాశాలు, తద్వారా దాదాపు రెండు కోట్ల మందికి వాటి ప్రయోజనాలు చేరే ప్రయోగాత్మక చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. 20 లక్షలమందికిపైగా జఠిల సమస్యలనుంచి విముక్తమై, తద్వారా పరోక్షంగా రెండు కోట్ల మందికి భరోసాతో వారి మనసు లను గెల్చుకునేందుకు వ్యూహాత్మకంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెడీ అవుతున్నది. ఈ క్రమంలో ఈ నెల 17న పలు కొత్త నిర్ణయాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు బీఆర్‌ఎస్‌ ఆమోదముద్ర వేయనుందని సమాచారం. సాదా బైనామాల(తెల్ల కాగితలపై జరిపిన భూక్రయ విక్రయాలు)పై ప్రభుత్వ చర్యలకు ఇప్పటివరకు ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. వెంటనే క్రమబద్దీకరించి పేదలకు ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి కోర్టు కేసు అడడంకిగా మారగా, వివాద పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. దరఖాస్తులు తీసుకొని ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకోనున్నదని సమాచారం.
న్యాయపరమైన వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టి, సుదీర్ఘకాలంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న 9.20లక్షల మంది రైతులకు వరం ప్రకటించనున్నది.

2014 జూన్‌ 2తో కటాఫ్‌ తేదీగా నిర్ణయించిన సర్కార్‌ అంతకుముందు తెల్ల కాగితాలపై రాసుకున్న క్రయవిక్రయాలకు రిజిస్ట్రేషన్లు ఉచితంగా జరపాలని నిర్ణయించి దరఖాస్తులను స్వీకరించింది. అర్హులైన దరఖాస్తుదారులకు 13బి ప్రొసీడింగ్స్‌ను జారీ చేసి ఆర్డీవోల ద్వారా పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలను జారీ చేస్తోంది. గతంలో రెండు దశల్లో ఉచితంగా క్రమబద్దీకరణకు, రిజిస్ట్రేషన్లకు అవకాశమిచ్చిన ప్రభుత్వం చివరి విడుతగా మరో అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇందుకుగానూ 2020 అక్టోబర్‌ 18నుంచి నవంబర్‌ 10 వరకు రెండు విడతల్లో మొత్తం 9.20లక్షల దరఖాస్తులను స్వీకరించింది.

ఆదివాసీలకు అద్భుత భరోసా….
ఎన్నికల ఏడాదిలో ఆదివాసీలకు ప్రభుత్వం కొండంత అండను అందించేందుకు సన్నద్ధమైంది. ఈ నెల 17న జరిగే సమావేశం తర్వాత పోడు భూముల సమస్య పరిష్కారం కానున్నది. రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు, ఆదివాసీల జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఎకరాలకు చెందిన 1,55,393 మంది అడవి బిడ్డలకు పోడు పట్టాలను అందించనున్నారు. ఇప్పటికే 4లక్షల 903 ఎకరాలకు సంబంధించిన పట్టాలను ప్రభుత్వం ప్రింట్‌ చేయించింది. వచ్చే నెలలో పోడు రైతులకు పట్టాలను అందించి పోడు భూములపై శాశ్వత హక్కుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
రాష్ట్రవ్యాప్తంగా 13.18లక్షల ఎకరాల పోడు భూములకు చెందిన రైతులకు 2021 నవంబర్‌ 8నుంచి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. ఈ సందర్భంగా 2450 గిరిజన గ్రామాల్లో పోడు భూముల సమస్యలున్నట్లుగా ప్రభుత్వం నిర్ధారించింది.
నవంబర్‌లో దరఖాస్తుల ప్రక్రియ పూర్తవడంతో లబ్దిదారుల గుర్తింపు కార్యాచరణ జరుగుతోంది. అటవీ హక్కుల చట్టం-2005 ప్రకారం 6లక్షల ఎకరాలకు చెందిన భూములపై దరఖాస్తులు వస్తాయని భావించగా అత్యధికంగా 13.18లక్షల ఎకరాలకు దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అర్హత కల్గిన దరఖాస్తుల సంఖ్య 1.5లక్షలుగా గుర్తించారు. గుర్తించిన అర్హులకు వెంటనే అర్హులకు పోడు పట్టాలు అందించనున్నారు. ఆయా భూములకు పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు, రైతుబంధు, రైతుబీమా వంటి సంక్షేమ పథకాలు అందించనున్నారు.

కోర్టు కేసులతో ఇబ్బందులు…
సాదాబైనామాలపై 2020 అక్టోబర్‌ 30న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నూతన ఆర్వోఆర్‌ చట్టం ప్రకారం రద్దయిన ఆర్వోఆర్‌ చట్టం ప్రకారం వచ్చిన దరఖాస్తులను ఎలా పరిష్కరిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అక్టోబర్‌ 29లోపు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని, ఆ తర్వాత వచ్చిన వాటిని పక్కన పెట్టాని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నూతన ఆర్వోఆర్‌ చట్టంలో సవరణలకు నిర్ణయించింది.

9లక్షలమందికి…
గతంలో రెండు దశల్లో సాదా బైనామాలకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం గతేడాది మరో అవకాశం ఇచ్చింది. మార్చి 12 నాటికి 2,45,668 ఎకరాల క్రమబద్దీకరణను పూర్తి చేసి నిరుపేదలక ఉచిత రిజిస్ట్రేషన్‌ చేయించాలని నిర్ణయించింది. 2016 జూన్‌ 3న సీఎం కేసీఆర్‌ సాదాబైనామాల ఉచిత క్రమబద్దీకరణ నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో దాదాపు 11,19,112 దరఖాస్తులు రాగా వీటిలో 2,68,610 ఎకరాలకు సంబంధించిన 6లక్షల 18వేల 368 దరఖాస్తులను క్రమబద్దీకరించారు. ఇందులో 4,19,430 దరఖాస్తులను వివిధ కారణాలతో ప్రభుత్వం తిరస్కరించింది. కాగా వీటికి కూడా అనుమతినివ్వాలని తాజాగా సీసీఎల్‌ఏ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయం రెండు దశల్లో పేదలకు ప్రయోజనకారిగా సత్ఫలితాలనిచ్చింది. నిరుపేదలకు ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసి వారికి పట్టాలు అందించారు. 13బీ ధృవీకరణ పత్రాన్ని సేఫ్టీ బార్‌కోడ్‌ క్విక్‌ రెస్పాన్స్‌ కోడ్‌ ఆధారంగా జారీ చేయాలని నిర్ణయించింది. గత 20-30 ఏళ్లుగా కాగితాల మీదనే ఉన్న భూముల క్రయవిక్రయాల వ్యవహారం రిజిస్ట్రేషన్‌తో చట్టబద్దం కానుంది. 2014 జూన్‌ 2నాటికి సాదాబైనామాల మీద ఉన్న ఐదు ఎకరాల లోపు భూమిని ఉచితంగా రిజిస్టర్‌ చేసి, పేరు మార్పిడి చేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలను అమలు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement