తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్రం ఎన్నికల సంఘం ఈ షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబరు 9వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా, నవంబరు 19న పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ తరుపున ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఆపార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా కడియం శ్రీహరి, సిరికొండ మధుసూదనచారి, రవీందర్‌రావు, ఎల్. మరణ, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డిల పేర్లను ఖరారు చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. బీసీలు, రెడ్డి సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ పేర్లను ఖరారు చేశారు.
హుజూరాబాద్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం లభించింది. గతంలో పాడి కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదించనా.. వివిధ కారణాలతో గవర్నర్ ఆఫైల్ ను పెండింగ్ లో పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.
కాగా, తెలంగాణలో ఆరుగురు ఎమ్మెల్సీ పదవీ కాలం జూన్ 3న ముగిసింది. ఈ ఎన్నికలు గతంలోనే జరగాల్సి ఉండగా, కోవిడ్ కారణంగా ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 19న పోలింగ్ నిర్వహించననున్నారు. అదే రోజున ఫలితాలు కూడా విడుల అవుతాయి.
ఇది కూడా చదవండి: ప్రకాశం జిల్లాలో రాజధాని రైతులు పాదయాత్ర