Tuesday, November 26, 2024

కేసీఆర్ ఢిల్లీ టూర్‌.. రెండు, మూడు రోజులు అక్క‌డే!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకువచ్చేందుకు నడుం బిగించిన తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ మరోసారి హస్తినకు పయనమవుతున్నారు. మూడు, నాలుగు రోజులపాటు అక్కడే ఉండనున్న ఆయన వివిధ రాజకీయ పక్షాలకు చెందిన కీలక నేతలు, విశ్రాంత సివిల్‌ సర్వెంట్‌ అధికారులతో సమావేశమయ్యే అవకాశముందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లిd సరిహద్దుల్లో సుదీర్ఘంగా పోరాడి పోలీస్‌ తూటాలు, లాఠీఛార్జితో అసువులు బాసిన రైతులను పరామర్శించి వారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించేందుకు సీఎం కేసీఆర్‌ శుక్రవారం పంజాబ్‌ బయలుదేరి వెళ్లాలని సంకల్పించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన రైతు కుటుంబాలను కలిసి చెక్కులు అందజేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాద్‌లో గత నెలలో జరిగిన తెరాస ఒకరోజు ప్లీనరీ సమావేశంలో అధ్యక్షోపన్యాసం చేసిన సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై తన మనసులోని మాటను ప్రకటించిన సంగతి తెలిసిందే.

ప్రధాని కుర్చీలో ఉన్న వారిని గద్దె దించడం కోసం జాతీయ స్థాయిలో తాను ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయడం లేదని, గుణాత్మక మార్పు కోసమే అడుగులు వేస్తున్నానని చెప్పిన విషయం విదితమే. రెండు వారాలుగా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో గడిపిన సీఎం కేసీఆర్‌ జాతీయ స్థాయి రాజకీయాలపైనే పూర్తిగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు, ముఖ్య నేతలు, రాజ్యాంగ నిపుణులు, రాజకీయ కోవిదులు, విశ్రాంత ఐఏఎస్‌, ఐపీఎస్‌లు, మాజీ కేంద్ర మంత్రులు, వాణిజ్య, పారిశ్రామిక వేత్తలతో సమాలోచనలు జరిపినట్టు తెరాస వర్గాలు చెబుతున్నాయి.

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా పెంచుతున్న పన్నులు, నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్‌, డీజెల్‌, గ్యాస్‌ ధరల పెంపుతో పాటు రాష్ట్రాల అధికారాలను ఎలా నియంత్రిస్తున్నది, రాష్ట్రం పరిధిలో ఉన్న వివిధ అంశాలను కేంద్రం తన గుప్పెట్లో పెట్టుకుని హక్కులను హరించివేస్తున్న వైనంపై ఆయా రంగాల వారితో కేసీఆర్‌ సుదీర్ఘంగా మంతనాలు జరిపి వారి నుంచి కీలక సలహాలను రాబట్టినట్టు చెబుతున్నారు. జాతీయ స్థాయిలో బలమైన కూటమిని ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కేసీఆర్‌ అందుకు అనువైన వ్యూహాన్ని రూపొందిస్తున్నారన్న ప్రచారం తెరాస వర్గాల్లో, బయట జరుగుతోంది. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు లోపభూయిష్టంగా ఉందని, రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం, ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలతో కర్షకులు అతలాకుతలమవుతున్నా కేంద్ర ప్రభుత్వం వారిని ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని ఇదేమని అడిగితే కొత్త వ్యవసాయ చట్టాలను అమల్లోకి తెచ్చి వారిని మరింత బలహీనపరిచే చర్యలకు దిగుతోందన్న సీఎం కేసీఆర్‌ ఆరోపణలపై వ్యవసాయ రంగ నిపుణులు ఏకీభవించినట్టు తెలుస్తోంది.

రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వారిని అన్ని విధాలా ఆదుకునేందుకు అవసరమైన సమగ్ర వ్యవసాయ చట్టాన్ని తీసుకురావాలన్న ఆలోచనతో కేసీఆర్‌ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విధానంపై ఆయన ఈ రంగంలోని నిపుణులతో పాటు గతంలో వ్యవసాయ శాఖ విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులుగా పని చేసిన విద్యావేత్తలతోనూ మంతనాలు జరిపినట్టు సమాచారం. జాతీయ స్థాయిలో ఒకే తరహా సేకరణ విధానం ఉండాలన్న డిమాండ్‌ను తెరపైకి తీసుకురావాలని ఆయన నిర్ణయించినట్టు తెలుస్తోంది. నదుల అనుసంధానంతో పాటు దేశంలో నీటి నిల్వలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నా వాటిని సరైన పద్ధతిలో వినియోగించుకోలేకపోతున్నామని నీరంతా సముద్రం పాలవుతోందని ఇందుకు సమగ్ర విధానాన్ని రూపొందించుకునేందుకు సిద్ధం కావాలని కేసీఆర్‌ సంకల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement