హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి అనేక కార్యక్రమా లతో పర్యావరణ హిత రాష్ట్రంగా దేశంలోనే తన కంటూ ఒక ప్రత్యేకతను దక్కించుకున్న తెలంగాణ లో ఉల్లంఘనలను కేసీఆర్ సర్కారు తీవ్రంగా పరిగ ణిస్తోంది. అందుకోసం ఇప్పటికే అమల్లో ఉన్న భూమి, నీరు, చెట్టు పరిరక్షణ చట్టం (వాల్టా) మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. మారుమూల గ్రామాలు మొదలుకుని పట్టణాలు, నగరాల్లో యథేచ్ఛగా వాల్టా చట్టం ఉల్లంఘనకు గురవుతున్న నేపథ్యంలో సవరణలతో కొత్త చట్టం తేచ్చే దిశగా ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. వచ్చే వందేళ్ళ సంరక్షణ దూరదృష్టితో కొత్త చట్టాన్ని తీసుకువచ్చి పర్యావరణాన్ని పరిపక్షించాలని, బావి తరాలకు బంగారు బాట వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ బిల్లు రూప కల్పనకు సంబంధించి అటవీ, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల సంయుక్త భాగస్వామ్యంతో అధ్య యనం చేసి తదనంతర చర్యలకు పూనుకోవాలని తాజాగా ఆయన సంకల్పించారు.
ఈ అంశంపై ఇప్పటికే సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు సీఎం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు అధికార వర్గా లు వెల్లడించాయి. ఉల్లంఘనలకు ఏ కోణంలోనూ ఆస్కారం లేకుండా కఠినమైన నిబంధనలు కొత్త చట్టంలో పొందుపర్చనున్నారు. అనుబంధ రంగా లు కూడా చట్టం పరిధిలోకి తీసుకురానున్నారు. వ్యవసాయంలో హానికరమైన రసాయనాలు వినియోగించడం, కుంటలు, చెరువులు, వాగులు, వంకల్లో అక్రమ తవ్వకాలు జరుపడం, అనుమతి లేకుండా ఇటుక బట్టీలు విచ్చలవిడిగా ఏర్పాటు చేయడం, మొక్కలను నాటించి వాటిని పరిరక్షించడం, చెట్లు నరికే విధానాన్ని పూర్తిగా నిర్మాలించడం, అందుకు ప్రత్యామ్నాయ విధానాలను అనుసరించడం, విచ్చలవిడిగా బోరుబావులను తవ్వించడం, భూగర్భ జలాలను అడుగంటించే ఎలాంటి చర్యలనైనా అడ్డుకోవడం లాంటి అనేక అంశాలు కొత్త చట్టంలో కీలకం కానున్నాయి. సమాజంలో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న అనేక చర్యలను పరిగణనలోకి తీసుకుని పర్యావరణ హితంపై తెలంగాణ సర్కారు పట్టు బిగిస్తోంది.
కొత్త చట్టానికి ఇవీ కారణాలు..
ఇప్పుడున్న వాల్టా చట్టంలో అనేక లొసుగులున్నందున అమలు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఫలితంగా హైదరాబాద్ మహానగరం లాంటి పట్టణ ప్రాంతాల్లో భూగర్భజలాలు పాతాళానికి పడిపోతున్నాయి. వాతావరణంలో చోటుచేసుకుంటున్న విపరీత మార్పులు, నానాటికీ పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు, ఇసుక అక్రమ తవ్వకాల వల్ల కాలువల నుంచి నీటి ప్రవాహం లేకపోవడం, సామర్థ్యానికి మించి బోరు తవ్వకాలు జరుపుతుండటం, ఎడాపెడా తోడేస్తుండటంతో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. సాధారణంగా అయితే ప్రతియేటా సెప్టెంబర్- అక్టోబర్ నెలల్లో మెజార్టీ ప్రాంతాల్లో మూడు మీటర్ల లోతునే నీటి ఆనవాళ్లు ఉండగా.. క్రమక్రమంగా పది మీటర్లు దాటినా కనిపించడం లేదు. భూ పొరల్లో నీరు లేకపోవడంతో వ్యవసాయ బోర్లు పని చేయడం లేదు. కొన్ని ఎగువ ప్రాంతాల్లో బావులు, చెరువుల కింద వరి, ఇతర పంటలు నీరు లేక ఎండిపోతున్నాయి.
పట్టణీకరణతో నీటి వినియోగం నానాటికీ అధికం
గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లోనే నీటి వాడకం నానాటికీ అధికమవుతూ వస్తోంది. వాల్టా చట్టం ప్రకారం 350 నుంచి 400 అడుగుల లోతు వరకు బోరు తవ్వుకునేందుకు మాత్రమే అనుమతి ఉంది. కానీ చాలామంది సంబంధిత శాఖల నుంచి అనుమతి పొందకుండా, నిపుణుల సూచనలు పాటించకుండా 2వేల నుంచి 3వేల ఫీట్లు- తవ్వుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో భూగర్భ నీటిమట్టం స్థాయి మరింత లోతుకు పడిపోతుండటానికి ఇదే ప్రధాన కారణమని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో వాల్టా ఉల్లంఘనలు అధికం
ఏజెన్సీలో వాల్టా చట్టానికి కొందరు తూట్లు- పొడుస్తున్నా అటవీ, రెవెన్యూ అధికారులు పట్టనట్టు- వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అవి అనేక సర్వేల్లో వాస్తవమని నిరూపించబడ్డాయి. పచ్చని చెట్లపై గొడలి వేటు- పడుతున్నా, ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నా చట్టం కఠినంగా లేకపోవడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించడం లేదు.
బోర్ల తవ్వకాల ఫిర్యాదులపై కానరాని స్పందన
బోర్ల తవ్వకాల ఫిర్యాదులపై అధికార యంత్రాంగంలో స్పందన కనిపించడం లేదు. బోరుబావి తవ్వకానికి ముందుగా భూగర్భ జల శాఖ అధికారుల అనుమతులు తీసుకోవాలి. ఎంత లోతు వరకు, ఏ ప్రాంతంలో బోరు వేయాలో వారు నిర్ధారించిన తర్వాత రెవెన్యూ అధికారుల భూ పరిశీలన చేస్తారు. వాల్టా చట్టాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నా, అధికారుల నిర్లక్ష్యం, నేతల ఒత్తిళ్ల వల్ల నీరుగారుతోంది. బోరు బావుల తవ్వకాలపై ప్రజల నుంచి వందల్లో ఫిర్యాదులొస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.