Saturday, November 23, 2024

బిఆర్ఎస్ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయండి.. మ‌ళ్లీ మీ గ‌డ్డ‌పై అడుగుపెట్ట‌నుః ఫ‌డ్నావీస్ కు కెసిఆర్ స‌వాల్

లోహా (మ‌హారాష్ట్ర‌) – తెలంగాణాలో త‌మ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను మ‌హారాష్ట్ర‌లోనూ అమ‌లు చేస్తే తాను తిరిగి మ‌హారాష్ట్ర‌లో అడుగుపెట్ట‌న‌ని బిఆర్ ఎస్ అధినేత , తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ మ‌హారాష్ట్ర ఉప‌ ముఖ్య‌మంత్రి ఫ‌డ్నావీస్ కు స‌వాల్ విసిరారు.. ప‌క్క రాష్ట్ర పార్టీకి ఇక్క‌డ ఏం ప‌ని అంటూ బిజెపి నేత దేవేంద్ర ఫ‌డ్నావీస్ చేసిన కామెంట్స్ పై ఘాటుగా స్పందించిన గులాబీ ద‌ళ‌ప‌తి మాట్లాడుతూ , తెలంగాణలో ఎకరానికి రూ.10వేలు ఇస్తున్నాం. తెలంగాణలో రైతులకు రూ.5లక్షల రైతుబీమా ఇస్తున్నాం. పూర్తిగా పంట కొంటున్నాం. తెలంగాణ తరహా అభివృద్ధి ఫడ్నవీస్‌ చేస్తే నేను మహారాష్ట్ర రానని ప్రకటిస్తున్నా. తెలంగాణ తరహా పథకాలు మహారాష్ట్రలో అమలు చేయనంత వరకు నేను వస్తూనే ఉంటా అని స్పస్టం చేశారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా లోహాలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభకు హాజ‌రైన సందర్భంగా మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్ రావు దోండే సహా పలువురు నేతలు పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు


అనంత‌రం స‌భ‌కు హాజ‌రైన అశేష జ‌న‌వాహిణిని ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ, ‘ఛత్రపతి శివాజీ మహరాజ్‌కు జన్మనిచ్చిన మరాఠా పుణ్యభూమికి ప్రణామం. పార్టీలో చేరుతున్న నేతలకు హృదయపూర్వక స్వాగతం. లోహ సభకు తరలివచ్చిన ప్రజలు, రైతులకు ధన్యవాదాలు. నాందేడ్‌ వాసుల ప్రేమ కారణంగా ఇక్కడే రెండో సభ నిర్వహిస్తున్నాం. దేశంలో త్వరలో రైతు తుఫాన్‌ రాబోతోంది. దాన్నెవరూ ఆపలేరు. కేసీఆర్‌కు ఇక్కడేం పని అని మాజీ సీఎం ఫడ్నవీస్‌ అంటున్నారు. భారత పౌరుడిగా ప్రతీ రాష్ట్రానికి వెళ్తా’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
“అంబేద్క‌ర్ పుట్టిన నేల‌లో తెలంగాణ త‌ర‌హాలో ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని వెంట‌నే అమ‌లు చేయాల‌ని అక్క‌డి బిజెపి స‌ర్కార్ ను కోరారు.. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా పేదల బతుకులు మారలేదు. కాంగ్రెస్‌, బీజేపీలతో మన బతుకులు మారాయా?. రెండు పార్టీల పాలనలో రైతుల పరిస్థితి ఎందుకు మారలేదు ? నేను చెప్పేది నిజమో అబద్ధమో మీరో ఆలోచించండి” అంటూ మహారాష్ట్ర ప్రజలను ప్రశ్నించారు కేసీఆర్.
“అమెరికా, చైనా కంటే నాణ్యమైన భూమి మనకు ఉంది. కాంగ్రెస్‌ 54 సంవత్సరాలు, బీజేపీ 14 ఏళ్లు పాలించి ఏం చేశాయి? ఏటా 50వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. మహారాష్ట్రలో పుట్టే కృష్ణా, గోదావరి నదులు ఉన్నా రైతులకు ఎందుకు మేలు జరుగట్లేదు? మహారాష్ట్రలో సాగు, తాగునీరు చాలాచోట్ల అందుబాటులో లేదు. మన కళ్ల ముందే నీరు సముద్రంలో కలిసిపోతుంది. ఎంత మంది పాలకులు మారినా ప్రజల తలరాతలు మారలేదు. నేతలు తలచుకుంటే దేశంలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చు. మహారాష్ట్రలో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం. మహారాష్ట్రలో ప్రతి ఎకరానికి రూ.10వేలు ఇచ్చే వరకు కొట్లాడుతాం ” అని అన్నారు కేసీఆర్.
“దేశంలో సమృద్ధిగా సహజ వనరులున్నాయి. దేశంలో 360 బిలియన్‌ టన్నుల బొగ్గు ఉంది. దేశంలో ఉన్న బొగ్గుతో 24 గంటలు సులభంగా విద్యుత్‌ సులభంగా ఇవ్వొచ్చు. 125 ఏళ్ల పాటు విద్యుత్‌ ఇచ్చేంత బొగ్గు మన దగ్గర ఉంది. అయినా ఎందుకు విద్యుత్‌ ఇవ్వలేకపోతున్నారు. పీఎం కిసాన్‌ కింద కేంద్రం కేవలం రూ.6వేలు మాత్రమే ఇస్తుంది. పీఎం కిసాన్‌ కింద రైతులకు కనీసం రూ.10వేలు ఇవ్వాలి. ఉల్లి, చెరుకు రైతులు ధరల కోసం ఏటా పోరాడాల్సిందేనా? ఇది రాజకీయ సభ కాదు. బతుకులపై ఆలోచన సభ. యూపీ, పంజాబ్‌లో నేతల మాయమాటలకు మోసపోయారని” కేసీఆర్ అన్నారు.
మహారాష్ట్రలో జరగనున్న పంచాయతీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందన్నారు. ఇక్కడ కూడా గులాబీ జెండా ఎగరాలన్నారు. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో సభలు నిర్వహించాలని విజ్ఞప్తులు వస్తున్నాయని కేసీఆర్ తెలిపారు. రైతు సంక్షేమ‌మే ధ్యేయంగా త‌మ పార్టీ ముందుకు సాగుతుంద‌ని, రైతే రాజు అని కెసిఆర్ స్ప‌ష్టం చేశారు. దేశాన్ని ఇప్పటి వరకు పరిపాలించిన కాంగ్రెస్, బిజెపిలు ఒకే నాణానికి బొమ్మ, బోరుసులాంటివని అన్నారు.. ఆ పార్టీలకు స్వంత ప్రయోజనాలే తప్ప ప్రజా సంక్షేమం పట్టదని వ్యాఖ్యానించారు తెలంగాణ ముఖ్యమంత్రి.

Advertisement

తాజా వార్తలు

Advertisement