Friday, November 22, 2024

111 జీవో రద్దు, హుస్సేన్‌ సాగర్‌తో గోదావరి జలాల అనుసంధానం – క్యాబినెట్

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజులపాటు జరపాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నూతన సచివాలయంలో తొలిసారి మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్‌ తీసుకున్న పలు కీలక నిర్ణయాలను మంత్రులు హరీశ్‌రావు గంగుల కమలాకర్, , తలసాని శ్రీనివాసయాదవ్ లు మీడియా సమావేశంలో వెల్లడించారు

”కులవృత్తులను బలోపేతం చేసేందుకు, వారికి ఆర్థికంగా చేయూత అందిచేందుకు విధి విధానాలను రూపొందించాలని బీసీ సంక్షేమశాఖమంత్రి గంగుల కమలాకర్‌ నేతృత్వంలో కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఒక్కో లబ్ధిదారుడు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించే విధంగా పథకం రూపకల్పన చేయాలని సీఎం సూచించారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించాలని కేబినెట్‌ నిర్ణయించింది. 111 జీవోను పూర్తిగా ఎత్తివేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఈజీవో పరిధిలో ఉన్న 84 గ్రామాల ప్రజలు అభివృధ్ధికి దూరంగా ఉన్నామని ఏన్నో ఏళ్లుగా ఆందోళన చేస్తున్నారు. దీనిపై స్పందించిన సీఎం 84 గ్రామాలకు మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న గ్రామాలకు ఎలాంటి విధి విధానాలు అమల్లో ఉంటాయో, వారికి కూడా అవే నిబంధనలు వర్తిస్తాయి.

కాళేశ్వరం జలాలతో హిమాయత్‌సాగర్‌, గండిపేట అనుసంధానానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. హుస్సేన్‌ సాగర్‌తో గోదావరి జలాలను అనుసంధించాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 38 డీఎంహెచ్‌ఓ పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 40మండలాలకు పీహెచ్‌సీలను మంజూరు చేస్తూ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లలో శాశ్వత ఉద్యోగుల నియామకానికి కూడా కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. వ్యవసాయ రంగంలో పలు మార్పులు తెచ్చేంందుకు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్‌ సబ్‌కమిటీని ఏర్పాటు చేస్తూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. వీఆర్‌ఏలను క్రమబద్ధీకరించి, వివిధ విభాగాల్లో వారిని సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది” అని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement