Friday, November 22, 2024

TS | కందుకూరు వరకు మెట్రో రైలు పొడిగిస్తాం: సీఎం కేసీఆర్​

రాష్ట్ర రాజధాని హైదరాబాద్​లోని మరిన్ని ప్రాంతాలను కలుపుకుని హైదరాబాద్ మెట్రో రైలు నెట్‌వర్క్ ను విస్తరించనున్నట్లు సీఎం కేసీఆర్​ సోమవారం ప్రకటించారు. హైదరాబాద్‌ మెట్రోరైలును శంషాబాద్‌ విమానాశ్రయం వరకు పొడిగించడం త్వరలో సాకారం అవుతుందన్నారు. ఇక.. మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు వరకు మెట్రో పొడిగిస్తామన్నారు. రంగారెడ్డి జిల్లాలోని తూములూరు గ్రామంలో హరితహారం ఫేజ్-9 ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం ఈ ప్రకటన చేశారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

హైదరాబాద్​ మెట్రోని కందుకూరు వరకు పొడిగించాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి చేసిన విజ్ఞప్తిపై సీఎం కేసీఆర్​ సానుకూలంగా స్పందించారు.దీన్నీ వాస్తవమైన డిమాండ్ గా సీఎం అభివర్ణించారు. బీహెచ్ఈఎల్ వరకు మెట్రో కనెక్టివిటీని తప్పనిసరి అవసరం అని కూడా కేసీఆర్ పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న శాసనసభ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని గులాబీ దళపతి చెప్పారు.

తుమ్మలూరులో హరితోత్సవం వేడుకల్లో భాగంగా మొక్కలు నాటిన ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ అమలుతో రాష్ట్రంలో దాదాపు 7.7 శాతం పచ్చదనం పెరిగిందన్నారు. తెలంగాణలో ఇప్పటికే 276 కోట్ల మొక్కలు నాటాం. అందుకే ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తుంది. ప్రతి గ్రామంలో ఒక నర్సరీ, ప్రతి గ్రామంలో పిల్లల కోసం ఓపెన్ జిమ్‌తో కూడిన ‘పల్లె ప్రకృతి వనం’ తో మనం మరింత అభివృద్ధి చెందాము అన్నారు.

- Advertisement -

సమష్టి కృషితోనే హరితహారం సక్సెస్​..

హరితహారంలో భాగంగా ఈ ఏడాది నుంచి ప్రజలకు ఉచితంగా పండ్ల మొక్కలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని పాలమూరు ఎత్తిపోతల పథకం పనులపై కాంగ్రెస్‌ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోవడం వల్లే ఆలస్యమైందని ఆరోపిస్తూ.. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, వికారాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు త్వరలో నీరందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణకు వ్యవసాయం చేయడం తెలియదని అవహేళన చేసిన వారు ఇప్పుడు ఏడో స్థానంలో ఉన్నారని, తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. తలసరి విద్యుత్ వినియోగం, తలసరి ఆదాయం, వరి ఉత్పత్తి, 24×7 విద్యుత్ సరఫరా తదితర సూచీల్లో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని సూచించారు. మహేశ్వరం నియోజకవర్గానికి తూములూరు గ్రామ పంచాయతీలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, ప్రతి గ్రామ పంచాయతీకి రూ.15 లక్షలు, అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి మున్సిపాలిటీకి రూ.25 లక్షలు మంజూరు చేయడంతోపాటు వైద్య కళాశాలను కేసీఆర్ ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement