బాన్సువాడకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లులు కురిపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన బీర్కూరు మండలం తిమ్మాపూర్ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ వేడుకలకు సీఎం హాజరయ్యారు. శ్రీదేవి, భూదేవి సతీసమేత వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమ అనంతరం ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో సీఎం పాల్గొని, బహిరంగ సభలో మాట్లాడుతూ… వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని గొప్పగా తీర్చిదిద్దారన్నారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నానన్నారు. ఆలయ అభివృద్ధికి రూ.7కోట్లు మంజూరు చేస్తామన్నారు. బాన్సువాడ అభివృద్ధికి రూ.50కోట్ల నిధులు ఇస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ఉమ్మడి ఏపీలో సాగునీటి కోసం ఇబ్బందులు పడ్డామన్నారు. అందుకే తెలంగాణ ఉద్యమం వచ్చిందన్నారు. బాన్సువాడ ప్రాంత ప్రజల కోసం పోచారం కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.