హైదరాబాద్, ఆంధ్రప్రభ: దేశంలో నిరుద్యోగ రేటు పెరుగుతోంది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం.. ఇప్పుడు ఆ ఉద్యోగాలు ఏమయ్యాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రధాని మోడీని ప్రశ్నించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. మోసపూరిత హామీతో యువతను దగా చేశారని బీజేపీ పార్టీపై మండిపడ్డారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న పది లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు అని ప్రశ్నించారు. అసలు వాటిని కేంద్రం భర్తీ చేసే ఉద్దేశ్యం కనిపించడం లేదన్నారు. ప్రస్తుతం దేశంలో వాస్తవంగా ఉన్న పరిస్థితులు ఏంటంటే.. నిజమైన డిగ్రీలు ఉన్న వాళ్లకు ఉద్యోగాలు లేవు కానీ డిగ్రీ లేని వ్యక్తికి అత్యున్నతమైన ఉద్యోగం ఉందని ఎద్దేవా చేశారు. యువత పట్ల ఏమైనా ఆందోళన ఉందా లేదా? యువత శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకునే కృషి ఏమైనా చేస్తున్నారా అంటూ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ ఎన్నికల హామీని ఇచ్చింది. ఆ హామీని గత 9 ఏళ్ల పాలనలో అమలు చేయకపోవడంపై ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సైతం ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే ఆలోచన ఉందా అంటూ నిలదీశారు. మోసపూరిత హామీలతో కేంద్రంలోని బీజేపీ ప్రజలను దగా చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిగ్రీలు ఉన్న వారికి ఎలాంటి ఉద్యోగాలను కేంద్ర ప్రభుత్వం కల్పించలేకపోతుందంటూ ఆవేదనను తెలిపారు. అదే ఎలాంటి డిగ్రీ లేకున్నా అత్యున్నత ఉద్యోగం లభించిందని ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ట్విట్టర్ వేదికగా కేంద్రంలోని బీజేపీ అవలంభిస్తున్న విధానాలపై మండిపడ్డారు. నిరుద్యోగ రేటు 7.8 శాతానికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు.