ఇటీవలే టీఆర్ఎస్ పార్టీలో చేరిన హుజురాబాద్ నేత పాడి కౌశిక్ రెడ్డిని రాష్ట్ర కేబినెట్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేసింది. ఆదివారం జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం జరగ్గా… ఈ మేరకు కౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ తమిళిసైకి సిఫారసు చేశారు. గత నెల 21న కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరగా… ఆయనకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే ఎమ్మెల్సీ పదవితో ఆయకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. కేబినెట్ నిర్ణయంపై కౌశిక్ రెడ్డితో పాటు ఆయన మద్దతుదారుల్లో సంతోషం నెలకొంది.
గతంలో కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్నారు. అయితే, తనకే టీఆర్ఎస్ టికెట్ వస్తుందని కార్యకర్తలతో మాట్లాడిన ఆడియో టేపు వైరల్ కావడంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కాంగ్రెస్. ఆ తర్వాత టీఆర్ఎస్ గూటికి కౌశిక్ రెడ్డి చేరారు.
కాగా, తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులు ఆరు ఉన్నాయి. ఇందులో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రాములు నాయక్,కర్నె ప్రభాకర్,మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డిల పదవీ కాలం గతేడాది మార్చి,జూన్,అగస్టుల్లో ముగిసింది. దీంతో ఆ స్థానాలకు ప్రజా కవి గోరెటి వెంకన్న,మాజీ ఎమ్మెల్యే బసవరాజు సారయ్య,వైశ్య సామాజికవర్గానికి చెందిన బొగ్గారపు దయానంద్‌లకు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. గవర్నర్ కోటాలో ఎంపికైన మరో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పదవీ కాలం జూన్ 16న ముగిసింది. తాజాగా ఆయన స్థానాన్ని కౌశిక్ రెడ్డితో భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిఫారసు చేసింది.
ఇది కూడా చదవండి: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్