– డిజిటల్ మీడియా, ఆంధ్రప్రభ
జమ్మూ కాశ్మీర్‌కు మరింత స్వయంప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రెండేళ్ల క్రితం రద్దు చేశారు. ఇప్పుడు దాన్ని పునరుద్ధరించలేమన్నారు గులాంనబీ ఆజాద్. ఇవ్వాల (ఆదివారం) కాశ్మీర్‌లోని బారాముల్లాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. సొంత రాజకీయ పార్టీని స్థాపించే యోచనలో ఉన్న ఆయన సభా వేదికగా తన ఆలోచనలు తెలియజేశారు. “ఆర్టికల్ 370 పునరుద్ధరణ కాదు. 370 పునరుద్ధరణకు పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. అయితే.. 370 పేరుతో రాజకీయ పార్టీలు ప్రజలను దోపిడీ చేయాలనుకుంటున్నాయి. కానీ, నేను అలా చేయనివ్వను.. అంతేకాకుండా 370 పేరుతో నేనూ ఎవరినీ మోసం చేయను”అని చెప్పారు.
“నా పార్టీ ఆజాద్ అవుతుంది. నా సహచరులు చాలా మంది పార్టీకి ఆజాద్ అని పేరు పెట్టాలని అన్నారు. కానీ, నేను ఎప్పుడూ పార్టీ పేరును వెల్లడించలేదు. కానీ, పార్టీ భావజాలం మాత్రం స్వతంత్రంగా ఉంటుంది. ఇది ఏపార్టీకి సపోర్టుగా నిలవదు, ఎందులో చేరదు. లేదా విలీనం కాదు. అట్లాంటిది ఏదైనా జరిగితే అది నా మరణానంతరం జరగవచ్చు, కానీ, అప్పటి వరకు స్వతంత్రంగానే ఉంటుంది”అని ఉద్వేగంగా చెప్పారు.
కాశ్మీర్‌లో రాజకీయ దోపిడీ లక్ష మందిని చంపేసి, ఐదు లక్షల మంది పిల్లలను అనాథలుగా మార్చింది. అబద్ధాలు, దోపిడీల ఆధారంగా తాను ఓట్లు అడగడడానికి రావడం లేదన్నారు ఆజాద్. తనకు ఎన్నికల ఖర్చు అయినా సాధ్యమయ్యేది మాత్రమే చెబుతానన్నారు. కొత్త రాజకీయ పార్టీ ఎజెండాలో రాష్ట్ర పునరుద్ధరణ కోసం పోరాడడం.. ప్రజల ఉద్యోగ, భూమి హక్కుల కోసం పోరాడడంగానే ఉంటుందన్నారు.
తనతో పాటు నిలబడి, తన పార్టీకి పునాదిగా నిలిచిన సహ లీడర్లకు కృతజ్ఞతలు చెబుతున్నానని, దేవుడు ఇష్టపడితే రాబోయే 10 రోజుల్లో పార్టీ పేరు డిక్లేర్ చేస్తానన్నారు ఆజాద్. ఇక.. గత ఆగస్టులో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కాశ్మీర్ లోయలో తన తొలి బహిరంగ సభను ఉద్దేశించి ఆజాద్ ఇవ్వాల ప్రసంగించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణకు, అక్కడి ప్రజల ఉద్యోగ, భూమి హక్కుల పరిరక్షణ కోసం పోరాడాలని ఉద్ఘాటిస్తున్నట్లు చెప్పారు. తన పార్టీ అభివృద్ధే ధ్యేయంగా ఉంటుందని, ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఎజెండాగా ఉంటున్నారు.