జమ్ముకశ్మీర్ లో ఓ కశ్మీరీ పండిట్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. బుద్గావ్ జిల్లాలో చదూరా ప్రాంతంలోని తహసీల్ కార్యాలయంలో రాహుల్ భట్ అనే కశ్మీరీ పండిట్ క్లర్క్ గా విధులు నిర్వహిస్తున్నారు. తహసీల్ కార్యాలయంలోకి ప్రవేశించిన ఇద్దరు ఉగ్రవాదులు ఆయనను పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ భట్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బుద్గామ్‌లోని చదూరాలోని తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగి రాహుల్ భట్ (35) కార్యాలయ ఆవరణలో ఉండగా, కనీసం ఇద్దరు సాయుధులు సమీపం నుంచి కాల్పులు జరిపారు. భట్‌ను ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు. ఇద్దరు ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడ్డారని, వారు పిస్టల్‌ను ఉపయోగించారని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఈ దాడికి తామే బాధ్యులంటూ కాశ్మీర్ టైగర్స్ అనే అంతగా పేరులేని సంస్థ సోషల్ మీడియాలో పేర్కొంది. అయితే, ఈ వాదనను J&K పోలీసులు వెంటనే ధృవీకరించలేదు.