మనీలాండరింగ్ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ఎండీ సి.పార్థసారథిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. అనంతరం హైదరాబాద్ కు తరలించారు. కోర్టులో హాజరు పరిచి కస్టడీ కోరనున్నట్టు అధికార వర్గాల సమాచారం.
మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద పార్థసారథిపై ఈడీ గతంలో కేసు నమోదు చేసింది. ఇన్వెస్టర్లకు సంబంధించిన షేర్లను వారి అనుమతి లేకుండా, వారికి చెప్పకుండా కార్వీ స్టాక్ బ్రోకింగ్ తన ఖాతాల్లోకి మళ్లించుకుని, వాటిపై బ్యాంకుల నుంచి రుణాలు పొందింది. ఆ రుణాలను పార్థసారథి తనకు సంబంధించిన రియల్ ఎస్టేట్ సంస్థల్లోకి మళ్లించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. కాగా, కార్వీ తీసుకున్న రుణాల విలువ రూ.3,000 కోట్ల వరకు ఉంటుందని ఈడీ అంచనా వేస్తోంది.