Saturday, November 23, 2024

Karnataka: సిద్ధరామయ్య మళ్లీ సీఎం కావాలి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మంత్రి

తన మాటలతో బీజేపీని ఇరుకునపెట్టేశారు కర్నాటక మంత్రి బి శ్రీరాములు. నిన్న జరిగిన ఓ ప్రోగ్రామ్​లో మంత్రి శ్రీరాములు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. “కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారిలో నేనూ ఒకడిని. వెనుకబడిన వర్గాల పక్షాన నిలబడే విషయంలో నేను, సిద్ధరామయ్య చాలా సారూప్యంగా ఉంటాం’’ అని కర్నాటక బీజేపీ మంత్రి బీ శ్రీరాములు అన్నారు.

బళ్లారిలో కురుబ సంఘం కమర్షియల్‌ స్టోర్‌, స్టూడెంట్‌ హాస్టల్‌ ప్రారంభోత్సవంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీతో పాటు కర్నాటక రాష్ట్రంలో హాట్​ టాపిక్​ అయ్యాయి. కాంగ్రెస్ అగ్రనేత గురించి మంత్రి శ్రీరాములు మాట్లాడుతూ.. “మేము రాజకీయ కారణాల వల్ల మాత్రమే ఒకరినొకరం విమర్శించుకుంటాం, ఇక్కడ వ్యక్తిగతంగా ఏమీ లేదు. సిద్ధరామయ్య కూడా ఏదో ఒక రోజు నన్ను సీఎంగా చూడాలని కోరుకుంటున్నారని నేను కచ్చితంగా అనుకుంటున్నాను. పెద్ద రాజకీయ వ్యవస్థలోనే రాజకీయ వ్యూహాలు రూపొందించుకోవాలి. ఒకరోజు సిద్ధరామయ్య, నేను ఒకే వేదికపై ఉంటాం. వెనుకబడిన కులాలను ఏకం చేసేందుకు సిద్ధరామయ్య, నేను కృషి చేస్తున్నాం.’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇక.. వెనుకబడిన వర్గాలు ఏకమైతే రాష్ట్రంలోనూ, దేశంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని మంత్రి బి. శ్రీరాములు అభిప్రాయపడ్డారు. ఇదిలావుండగా.. గత వారం బీజేపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి అరుణ్ సింగ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై “ఇక్కడే ఉన్నారు” రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి నాయకత్వం వహిస్తారని చెప్పారు. కాగా, కొన్ని వారాలుగా అనేక మంది ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల హత్యలతో కర్నాటకలో రాజకీయ గందరగోళం నడుస్తోంది.  దీని తర్వాత కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై “బలహీనమైన ముఖ్యమంత్రి”గా ముద్ర వేయబడ్డారు.

బీజేపీ ప్రధాన కార్యదర్శి, కర్నాటక ఇన్​చార్జి అరుణ్ సింగ్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. “బొమ్మైని తొలగించే ప్రశ్నే లేదు. మా నాయకత్వం ఆయనపై పూర్తి విశ్వాసం ఉంచింది. అతను కచ్చితంగా తన పదవీకాలాన్ని పూర్తి చేస్తారు ” అని చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తోంది. 150 సీట్లు సాధించాలన్న లక్ష్యంతో ఆ పార్టీ నేతలు ఇప్పటి నుంచే ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ ఎన్నికల్లో బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోనే పోటీ చేస్తామని అరుణ్ సింగ్ హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement