హిజాబ్ వివాదం ఇంకా సమసిపోలేదు. ఉత్తర కర్ణాటకలోని విజయపురంలోని ప్రభుత్వ పీయూ కళాశాల, గతంలో హిజాబ్‌లను అనుమతించింది, నేడు హిజాబ్‌లు ధరించిన విద్యార్థులను తరగతి గదుల్లోకి అనుమతించలేదు. తరగతి గదుల్లో మతపరమైన దుస్తులను అనుమతించకూడదనే షరతుపై మాత్రమే పాఠశాలలు , కళాశాలలను పునఃప్రారంభించేందుకు అనుమతించిన కోర్టు మధ్యంతర ఉత్తర్వులను మాత్రమే తాము అనుసరిస్తున్నామని కళాశాల నిర్వాహకులు వాదించారు. అయితే హిజాబ్‌లు లేదా బుర్ఖాలను ధరించడానికి అనుమతించబోమని కళాశాల తమకు తెలియజేయలేదని విద్యార్థులు చెబుతున్నారు.
హిజాబ్‌లు ,బుర్ఖాలతో తరగతి గదిలోకి ప్రవేశించిన కొంతమంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల ప్రిన్సిపాల్‌తో కోర్టు ఆదేశాలను పాటించమని అభ్యర్థిస్తున్నట్లు తెలుస్తోంది. మతపరమైన వస్త్రాలు, హిజాబ్ వంటి వాటిని విద్యాసంస్థల్లోకి అనుమతించబోమని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే ఉన్నామని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ వివాదం తర్వాత, విద్యార్థులు తమ హిజాబ్‌లు, బుర్ఖాలను తీసివేసి, తరగతి గదుల్లోకి ప్రవేశించడానికి కళాశాల లోపల ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు.కాలేజ్ ప్రవేశ ద్వారం వద్ద ప్రిన్సిపాల్ , విద్యార్థులను అడ్డుకున్నారు, కానీ వారు బలవంతంగా లోపలికి ప్రవేశించడానికి యత్నించారు. దాంతో హిజాబ్ వివాదం మరోసారి చెలరేగింది. నేటి నుంచి కర్నాటకలో యూనివర్సిటీ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా చర్యగా 9జిల్లాల్లో 144సెక్షన్ విధించారు. ఉడిపి, బాగల్‌కోట్, బెంగళూరు, చిక్కబల్లాపుర, గడగ్, తూమ్ కూర్, షిమోగ, మైసూర్, దక్షిణ కన్నడ జిల్లాల్లో 144సెక్షన్ విధించారు. ఈ జిల్లాల్లో నిరసనలు, ర్యాలీలతో పాటుగా ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండా నిషేధం విధించారు.
కాలేజ్‌ల ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితు రాజ్ అవస్తీ సారథ్యంలోని న్యాయమూర్తులు క్రిష్ణ దీక్షిత్, జేఎం ఖాజిల త్రిసభ్య ధర్మాసనం విచారణ కొనసాగిస్తుంది. మంగళవారం విచారణలో ఆసక్తికర వాదనలు వచ్చాయి. దక్షిణాఫ్రికాలోని ఓ కోర్టు వెలువరించిన తీర్పును, మతాలకు సంబంధించి టర్కీ రాజ్యాంగానికి, మన దేశ రాజ్యాంగానికి ఉన్న మౌలిక తేడాలు వంటి విషయాలను పిటిషనర్ తరఫు న్యాయవాది కామత్ ప్రస్తావించారు. వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. నేడు మధ్యాహ్నం 2.30 గంటలకు మళ్లీ ఈ పిటిషన్‌ను విచారించనుంది.