క్లాసు జరుగుతుంటేనే ఓ ముస్లిం విద్యార్థిని ఉగ్రవాది (టెర్రరిస్టు) అని పిలిచిన ప్రొఫెసర్‌పై మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వేటు వేసింది. అతడిని సస్పెండ్ చేయడమే కాకుండా విచారణకు కూడా ఆదేశించింది. స్టూడెంట్‌ని ప్రొఫెసర్ ఉగ్రవాదిగా సంబోధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ చర్యలు తీసుకున్నారు. శుక్రవారం (26న) ఈ ఘటన జరిగింది. తరగతులు నడుస్తుంటే విద్యార్థిని ప్రొఫెసర్ ఉగ్రవాదిగా పిలవడంతో బాధపడ్డ విద్యార్థి ఆయనతో వాగ్వివాదానికి దిగాడు. ‘ముస్లింగా ఉండి రోజూ ఇలాంటి ఎదుర్కోవడం అంత తమాషా కాదు’ అని విద్యార్థి ఆవేదన వ్యక్తం చేయడం ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది.
అప్పుడా ప్రొఫెసర్ బదులిస్తూ.. ‘నువ్వు నా కొడుకు లాంటి వాడివి’ అని పేర్కొన్నారు. దానికి విద్యార్థి మరింత బాధపడుతూ ‘‘మీరు నిజంగా మీ కొడుకుతో ఇలానే మాట్లాడతారా? మీరు అతడిని ఉగ్రవాది అని పిలుస్తారా? ఇంతమంది ముందు అట్లా ఎలా హేలన చేస్తూ పిలుస్తారు? ఇది తరగతి. మాకు పాఠాలు చెబుతున్నారు. మీరు అలా అనకూడదు’’ అని విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ఆ ప్రొఫెసర్ క్షమాపణలు తెలిపారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ప్రొఫెసర్‌ను ఎంఐటీ (మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై మణిపాల్ యూనివర్సిటీ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ ఎస్‌పీ కర్ మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలను తాము ఖండిస్తామన్నారు. మనది ఒకే ప్రపంచం, ఒకే కుటుంబంగా భావిస్తామని, అలాంటి చోట ఇలాంటివి తగవని అన్నారు.