రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వం ఓ సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ‘‘కాశీ యాత్ర’’ పేరిట పిలుస్తున్న ఈ పథకాన్ని ఇవ్వాల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. దీనికోసం తమ బడ్జెట్లో 7 కోట్లను కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయానికి తీర్థయాత్ర చేయడానికి రెడీగా ఉన్న రాష్ట్రంలోని 30వేల మంది యాత్రికులకు ఒక్కొక్కరికి 5వేల రూపాయల నగదు సహాయం అందించనున్నట్టు సీఎం బొమ్మై పేర్కొన్నారు.
మానస సరోవర యాత్రికులకు సహాయం అనే అకౌంట్స్ హెడ్ కింద ‘కాశీ యాత్ర’ కోసం మంజూరైన రూ. 7 కోట్లను వినియోగించుకునేందుకు మతపరమైన దేవాదాయ శాఖ కమిషనర్‌కు ప్రభుత్వం తన ఉత్తర్వులో ఈ అధికారం ఇచ్చింది. ఈ ప్రయోజనం పొందాలనుకునే వారు కర్నాటక వాసి అయి ఉండాలని, తమ ఓటరు గుర్తింపు, ఆధార్ వంటి వాటితో కర్నాటకలో నివాసం ఉన్నట్లు రుజువులను సమర్పించాలని అధికారులు ప్రకటించారు. కాగా, మతపరమైన దానం, హజ్, వక్ఫ్ మంత్రి శశికళ జోల్లె దీనికి సంబంధించి ఇవ్వాల ఈ ప్రకటన జారీచేశారు.
రేషన్ కార్డు ఉండి,18 ఏళ్లు పైబడిన వారు.. వయస్సు ధ్రువీకరణ పత్రాన్ని అందించాలని మంత్రి తెలిపారు. ఏప్రిల్ 1 నుండి జూన్ 30 వరకు తీర్థయాత్ర చేపట్టిన వారికి ఈ ప్రయోజనం దక్కుతుందన్నారు. ‘కాశీ యాత్ర’ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు తమ దర్శన టిక్కెట్టు లేదా వెయిటింగ్ లిస్ట్, ‘పూజ రసీదు’ వంటి వాటిలో ఏదైనా సరే కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించినట్లు రుజువును అందించాలని మంత్రి తెలిపారు. ఆ రిసీప్ట్ని తగిన ప్రొఫార్మాలో మతపరమైన ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ కమిషనర్‌కు సమర్పించాలని సూచించారు. ప్రభుత్వ ప్రాయోజిత ‘కాశీ యాత్ర’ను చేపట్టే వారికి ఎవరికైనా వారి జీవితంలో ఒక్కసారే ఈ ప్రయోజనం దక్కుతుందని మంత్రి జోలె చెప్పారు.