– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
కర్నాటకలో అధికార పీఠానికి చాలా దగ్గరగా ఉందన్న నివేదికలతో జోష్ మీదున్న కాంగ్రెస్ శిబిరం ఎన్నికల ఫలితాల ప్రకటనకు ఒక రోజు ముందు శుక్రవారం హోరాహోరీ కార్యకలాపాలను నిర్వహించింది. అయితే.. ముఖ్యమంత్రి పదవికి సంబంధించి ’50:50 ఫార్ములా’తో హైకమాండ్ సిద్ధంగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ నేతల సమాచారం ప్రకారం.. ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య, కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నారు. వీరిద్దరి మధ్య నెలకొన్న తీవ్ర పోటీని దృష్టిలో ఉంచుకుని అనవసర గందరగోళాన్ని నివారించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ 50:50 ఫార్ములాను రూపొందించిందినట్టు సమాచారం.
ఇక.. కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ గా ఉన్న వ్యక్తికి అధికారం ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నప్పటికీ, సిద్ధరామయ్య కారణంగా ఈసారి మినహాయింపు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. సిద్ధరామయ్య, శివకుమార్ శిబిరాలు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కాబోయే ఎమ్మెల్యేల మద్దతు పొందడంలో బిజీగా ఉన్నాయి. తమ సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మాజీ ఉప ముఖ్యమంత్రి, సీనియర్ దళిత నేత జి. పరమేశ్వర బెంగళూరులోని ఆయన నివాసంలో సమావేశమై చర్చలు జరిపారు.
ఈ భేటీ అనంతరం ఖర్గేతో సీఎం పదవిపై తానేమీ చర్చించలేదని పరమేశ్వర పేర్కొన్నారు. తాను ఈ విషయం గురించి మాట్లాడి గందరగోళం సృష్టించను. కాబోయే సీఎం ఎవరనేది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. అయితే.. లింగాయత్ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో గెలిస్తే లింగాయత్‌లు సీఎం అవుతారని కాంగ్రెస్ సీనియర్ నేత శామనూరు శివశంకరప్ప అన్నారు. కాంగ్రెస్ పార్టీ లింగాయత్ కమ్యూనిటీ అభ్యర్థులకు 51 టిక్కెట్లు ఇచ్చిన విషయం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.