Friday, November 22, 2024

Karnataka: మీ అభివృద్ధి చూసుకోండి.. మా భూభాగం గురించి మాటలెందుకు: సీఎం బొమ్మై

కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్​ని తెలంగాణలో కలపాలన్న డిమాండ్లు వస్తున్నాయి. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కొంతమంది మహిళలు, స్థానికుల ఇట్లాంటి అభిప్రాయాల వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ మధ్య కాలంలో  సీఎం కేసీఆర్​ కూడా కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్​ నుంచి చాలామంది తెలంగాణలో కలపాలన్న డిమాండ్​ తెస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై ఇవ్వాల కర్నాటక సీఎం బసవరాజ్​ బొమ్మై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. రాయచూర్​ జిల్లా పర్యటనకు వచ్చిన బొమ్మై కర్నాటక భూభాగంలో ఒక్క అంగుళం కూడా తెలంగాణకు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.

తెలంగాణలో రాయచూరు భాగమైతే ఆ జిల్లా బాగా అభివృద్ధి చెందుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలను బొమ్మై “హాస్యాస్పదంగా” అభివర్ణించారు. ‘‘రాయచూర్‌లో థర్మల్‌ ప్లాంట్‌, విమానాశ్రయం వంటివి ఉన్నాయి. అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నేను కళ్యాణ కర్ణాటక రీజియన్ డెవలప్‌మెంట్ బోర్డు (కెకెఆర్‌డిబి) కింద నిధులు కేటాయించాను. చాలా గ్రాంట్లు రాబోతున్నాయి” అని బొమ్మై స్పష్టం చేశారు.

ఇక.. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడి, అభివృద్ధిలో తనదైన వాటాను కలిగి ఉందని సీఎం బొమ్మై పేర్కొన్నారు. కర్నాటక భూభాగంపై దృష్టి పెట్టకుండా తమ రాష్ట్ర ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్‌కు ఆయన సూచించారు. ఆగస్టు 17న టీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తూ తెలంగాణ అభివృద్ధిని చూసి ఆకర్షితులై పొరుగున ఉన్న కర్నాటకలోని రాయచూర్‌ ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీ పాలిత రాష్ట్రంలో జిల్లాను కలపాలని డిమాండ్‌ చేస్తున్నారని పేర్కొన్నారు.

అంతకుముందు మంత్రి టి. హరీష్ రావు కూడా కర్నాటక సరిహద్దు గ్రామంలో కొంతమంది మహిళలతో మాట్లాడిన వీడియో వివాదానికి దారితీసింది. ఆ వీడియోలో హరీష్‌రావు మహిళలను కర్నాటక ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకుంటూ, తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో కంపేర్​ చ చేయడాన్ని బొమ్మై తప్పు పట్టారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement