Thursday, November 21, 2024

కన్నడనాట రాజకీయ వేడి.. కుర్చీ దిగిన యడ్డీ

కర్ణాటక రాజకీయాలు మరింత వేడెక్కాయి. కన్నడనాట యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ.. అనూహ్యంగా ఆయనను పదవి నుంచి తప్పించింది. సోమవారం సీఎం యడియూరప్ప రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లి గ‌వ‌ర్న‌ర్ థావర్ చంద్ గహ్లోత్‌ కు రాజీనామా లేఖ‌ను స‌మ‌ర్పించారు. కాగా, యడియూరప్ప రాజీనామాను గవర్నర్ తవర్ చంద్ గెహ్లాట్ ఆమోదించారు. ప్రస్తుతానికి ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని యడియూరప్పను గవర్నర్ కోరారు. తానేమీ బాధతో రాజీనామా చేయట్లేదన్న యడియూరప్ప అన్నారు. తనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా… 2 ఏళ్లపాటూ ముఖ్యమంత్రి పదవిలో కూర్చునే అవకాశం ఇచ్చారని అన్నారు. అందుకు వారికి ధన్యవాదాలు చెప్పారు.

కర్ణాటకలో నాయకత్వ మార్పు తప్పదని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చివరికి అవి నిజ‌మ‌వుతున్నాయి. య‌డియూర‌ప్ప‌ క‌ర్ణాట‌క‌కు నాలుగు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. రెండేళ్ల క్రితం క‌ర్ణాట‌క సంకీర్ణ ప్ర‌భుత్వం కుప్ప‌కూలాక ఆయ‌న సీఎం ప‌ద‌విని చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. నేటితో ఆయ‌న ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంది. య‌డియూర‌ప్ప‌కు 78 ఏళ్లు కావ‌డం, ఆయ‌న‌పై ప‌లు ఆరోప‌ణ‌లు రావ‌డం వంటి అంశాలు ఆయ‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డానికి కార‌ణాలుగా తెలుస్తోంది.  కాగా, 75 ఏళ్లు దాటిన వారు ప‌ద‌వుల్లో ఉండ‌డానికి వీల్లేద‌ని బీజేపీ నిబంధన పాటిస్తోంది. కానీ, యడియూరప్పను మాత్రం అధిష్ఠానం మరో రెండేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండేందుకు ఆయన ప్రమాణ స్వీకారానికి ముందే షరతులు విధించింది. అయితే.. ఇప్పుడు ఆయన రెండేళ్ల పాలన పూర్తైన నేపథ్యంలో పదవి నుంచి తప్పించింది.

యడ్యూరప్ప పదవికి రాజీనామా చేస్తారని ముందునుంచే ఊహాగానాలు వినిపించాయి. యడ్డీకి లింగాయత్ వర్గం నుంచి మద్దత ఉంది. దీంతో బీజేపీ హైకమాండ్ ఆయన్నే కొనసాగించే అవకాశాలు ఉన్నాయనే వాదన వినిపించింది. ఈ రాజీనామా వార్తల నేపథ్యంలో రెండు వారాల కిందట యడియూరప్ప ఢిల్లీ వెళ్లి.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిశారు. ఆ సమయంలోనే ఆయన రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. తర్వాత తన పదవికి ఎలాంటి ముప్పూ లేదనీ, తనను ఎవరూ రాజీనామా చేయమని కోరలేదని తెలిపారు.  అయితే ఆయనపై సొంత పార్టీలోనే వ్యవరేకత ఎదురైంది. పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయనపై పార్టీ అధిష్టానికి ఫిర్యాలు కూడా చేశారు. ఈ క్రమంలో జులై 26న నాటికి యెడ్డీ రెండేళ్ల పాలన పూర్తవుతుందనీ…. ఆ తర్వాత ఆయన కుర్చీ దిగిపోతారని ప్రచారం జరిగింది. తాజాగా అదే నిజమైంది.

మరోవైపు కొత్త సీఎంను బీజేపీ అధిష్టానం ఎంపిక చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే కొందరి పేర్లను పరిశీలించింది. క‌ర్ణాట‌క కొత్త ముఖ్య‌మంత్రి పేరును రేపు బీజేపీ అధిష్ఠానం ఖ‌రారు చేయ‌నుంది. ఇందుకోసం మంగళవారం ఢిల్లీలో బీజేపీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం కానుంది.  క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు దేశంలో జ‌రిగే లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ను కూడా దృష్టిలో పెట్టుకుని బీజేపీ పార్ల‌మెంట‌రీ స‌మావేశం కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement