Saturday, November 23, 2024

రాయచూర్ ను తెలంగాణలో కలిపేయాలి: బీజేపీ ఎమ్మెల్యే

కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లాను తెలంగాణలో విలీనంచేయాలని అక్కడి బీజేపీ ఎమ్మెల్యే శివరాజ్‌ డిమాండ్‌ చేయడం చర్చనీయాంశమైంది. గతంలో తెలంగాణలో అంతర్భాగంగా ఉన్న రాయచూర్ ను కర్ణాటకలో, నాందేడ్ జిల్లా మహారాష్ట్రలో కలిసిన సంగతి తెలిసిందే. గతంలో నాందేడ్ జిల్లాను తెలంగాణలో విలీనం చేయాలని కొందరు డిమాండ్ చేయగా.. తాజాగా రాయచూర్ జిల్లాను తెలంగాణలో కలపాలని డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలో రాయచూర్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీసింది.

సోమవారం రాయచూర్‌లో జరిగిన ఓ సమావేశంలో అక్కడి బీజేపీ ఎమ్మెల్యే శివరాజ్ మాట్లాడుతూ.. ఉత్తర కర్ణాటకలో హుబ్లీ, ధార్వాడ్‌, బెంగళూరును పట్టించుకొంటున్నారని, హైదరాబాద్‌ కర్ణాటక ప్రాంతంలో గుల్బర్గా, బీదర్‌ను మాత్రమే చూస్తున్నారని.. తమ రాయచూర్‌ బాగోగులు, సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. రైతులు, ఇతర అన్ని వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు తెలంగాణలో అద్భుతంగా అమలుచేస్తున్నారని కొనియాడారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలను తమ గ్రామాల్లోనూ అమలుచేయాలని.. అలా చేయలేకపోతే.. తెలంగాణలో కలిపేయాలని డిమాండ్‌ చేశారు.

బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు వైరల్ కావడంతో తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘తెలంగాణ ఖ్యాతి సరిహద్దులు దాటింది.. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే రాయచూర్‌ను తెలంగాణలో విలీనం చేయాలని కోరుతున్నారు. అక్కడున్న ప్రజలంతా ఆయన సూచనను చప్పట్లతో స్వాగతించారు’ అంటూ ట్వీట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement