Saturday, November 23, 2024

విపక్షాల ఐక్య‌త‌కు కాంగ్రెస్ 2.0…

న్యూఢిల్లి: కర్నాటకలో కాంగ్రెస్‌ విజయం.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో ఢీకొనడంలో విపక్షాల ఐక్యతకు మరింత జీవంపోస్తుందా? ఇప్పటిదాకా కాంగ్రెస్‌ పార్టీని చిన్నచూపు చూసిన బీజేపీయేతర పార్టీలు విపక్షాలకు నాయకత్వం వహించే బాధ్యతను కాంగ్రెస్‌ పార్టీకి అప్పగిస్తారా? అనే ప్రశ్నలు ప్రస్తుతం జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాం శంగా మారాయి. ఇప్పటివరకు చూస్తే.. విపక్షాలను ఏకం చేయడంలో కీలక పాత్రను పోషించడానికి పలు బీజేపీయేతర పార్టీలు ప్రయత్నించాయి. అలాంటి ప్రయత్నాలు చేసిన వారిలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌, బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లి సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ ముందువరుసలో ఉంటారు.


ఏడు మాసాల్లో రెండు విజయాలు
గతంలో వరుస ఓటములు చవిచూసిన కాంగ్రెస్‌ పార్టీని ద్వితీయ శ్రేణి పార్టీల గాటన కట్టడానికి బీజేపీయేతర పార్టీలు ప్రయత్నించాయి. కానీ కర్నాటకలో సాధించిన విజయంతో అప్పటివరకు తనను అనుమానంగా చూస్తున్న విపక్షాలకు హోరాహోరీ పోరులో బీజేపీని ఓడించే సత్తా తనకు ఉందని కాంగ్రెస్‌ పార్టీ చాటి చెప్పిందనేది రాజకీయ విశ్లేషకుల భావన. అది కూడా కేవలం ఏడు మాసాల్లో హిమాచల్‌ ప్రదేశ్‌ తర్వాత కర్నాటకలో కాంగ్రెస్‌ సాధించింది రెండవ విజయం. తద్వారా 2024 లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష కూటమికి నేతృ త్వం వహించేది తానే అనే స్పష్టమైన సంకేతాన్ని బీజేపీ యేతర పార్టీలకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిందనేది రాజకీయ పండితుల అభిప్రాయం.

కర్నాటకలో విజయం.. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌, మధ్య ప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ అసెంబ్లి ఎన్నికల పోరులో ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో పోరాడేలా కాంగ్రెస్‌ పార్టీని ప్రోత్సహించిం ది. ఆయా రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే బాధ్యత కాంగ్రెస్‌ పార్టీకి దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అది 2024 ఎన్నికల్లో విపక్షాలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో దారి చూపుతుందని తెలిపాయి. అయితే బీజేపీని, ప్రధాని మోడీని ఎన్నికల్లో ఎదుర్కోవడం లో విపక్షాలు వాటి వ్యూహానికి సరికొత్త మార్పులు చేసుకోవ లసిన అవసరం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బీజేపీని దీటుగా ఎదుర్కోవడంలో నువ్వా నేనా అనే తరహా లో పోరాటం వ్యూహరచనలో ఒక ముఖ్యమైన భాగం కావా లి. ఇదే విషయాన్ని కర్నాటకలో విజయం నిరూపించిం దని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. అయితే ఇది చెయ్యడం చెప్పినం త సులభం కాదనేది రాజకీయ పండితుల భావన. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కో తీరు అన్నట్టుగా కాంగ్రెస్‌ పార్టీ తనదైన వ్యూహరచన చేసి కార్యాచరణకు ఉపక్రమించాల్సిన అవస రం ఎంతైనా ఉందని సంబంధిత వర్గాలు అభిప్రాయపడ్డాయి.

పీఎం మోడీని, బీజేపీని జాతీయ స్థాయిలో దీటుగా ఎదుర్కొనే ఏకైక పార్టీగా కాంగ్రెస్‌ పార్టీ అవతరించిందని చెప్పడంలో ఎలాంటి సందేహానికి తావులేదని పార్టీ వర్గాలు తెలిపాయి. కర్నాటక, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో పొందిన విజయాలు కాంగ్రెస్‌ పార్టీకి కొత్త ఊపిరి పోశాయి. కొత్త శక్తిని పుంజుకున్న పార్టీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధిస్తుందనే ధీమాను పార్టీ నేతలు వ్యక్తం చేశారు. ”ఇది అతిపెద్ద విజయం. ఈ విజయంతో యావత్‌ దేశానికి కొత్త శక్తి చేకూరింది. ”కాంగ్రెస్‌-ముక్త్‌ భారత్‌ (కాంగ్రెస్‌ రహిత భారత్‌) ను నిర్మిస్తాం” అంటూ బీజేపీ నేతలు మమ్మల్ని ఆటపట్టించేవారు. కానీ నిజానికి అది కాస్త బీజేపీ-ముక్త్‌ సౌతిండియా(బీజేపీ రహిత దక్షిణ భారతం)గా మారింది” అంటూ కర్నాటకలో విజయం సాధించిన అనంతరం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే చేసిన వ్యాఖ్యలు వచ్చే ఎన్నికల దిశగా కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న సమరధికోత్సా హాన్ని ప్రతిబింబిస్తున్నాయనేది రాజకీయ పండితుల భావన. కర్నాటకలో విజయం ఒక్క కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే కాకుండా మిగిలిన బీజేపీయేతర పార్టీల్లో కూడా ఆనందోత్సా హాలను నింపిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోడీని ఎదుర్కోవడం సాధ్యమే అనే కొత్త నమ్మకాన్ని విపక్షాల్లో కలిగించిందని చెప్పాయి. కర్నాటకలో గెలుపుతో వృద్ధాప్యపు కుబుసాన్ని విడిచిన శతాధిక సంవత్సరాల పార్టీ కొత్త అవతరాన్ని ఎత్తిందని, అది ప్రస్తుతం కాంగ్రెస్‌ 2.0 గా మారిందని వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement