కరీంనగర్ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. కమాన్ వద్ద రోడ్డు ప్రమాదం ఘటన స్థలంలో బాధిత కుటుంబాల ధర్నా చేపట్టారు. తమ కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కామన్ రోడ్ పై ధర్నా నిర్వహించారు. కారు ప్రమాదంపై విచారణ జరపాలని , దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
రోడ్డుపై జీవనోపాధి సాగిస్తున్న కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఆదివారం ఉదయం కరీంనగర్ పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. కమాన్ వద్ద తెల్లవారుజామున కారు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న గుడిసెల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో గుడిసెల్లో నిద్రిస్తున్న నలుగురు దుర్మరణం చెందారు. పలువురికి గాయాలయ్యాయి. కారు బీభత్సంతో ఒకరు ఘటనాస్థలిలోనే మృతిచెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిని ఫరియాద్, సునీత, లలిత, జ్యోతిలుగా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కారును వదిలేసి నలుగురు యువకులు పరారైనట్లుగా పోలీసులు గుర్తించారు. కారుపై 9 ఓవర్‌స్పీడ్ చలాన్లు ఉన్నట్లు తెలిపారు.