తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘దళిత బంధు’ పథకాన్ని ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ లో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం సభను విజయవంతం చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వ టీచర్లపై పెట్టారు. జనసమీకరణ బాధ్యత టీచర్లకు అప్పగిస్తూ కరీంనగర్ జిల్లా విద్యాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమానికి జనాన్ని తరలించాలంటూ డీఈవో ప్రభుత్వ ఉపాధ్యాయులను ఆదేశించారు.
హుజూరాబాద్‌లో దళితబంధు పథకాన్ని ప్రారంభించేందుకు ఈ నెల 16న సీఎం కేసీఆర్ అక్కడికి వెళ్లనున్న నేపథ్యంలో డీఈవో ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి హుజూరాబాద్ పర్యటనకు ప్రజలను బస్సుల్లో తరలించే బాధ్యతను ఎంఈవోలు, జీహెచ్‌ఎంలు, కోఆర్డినేటర్లు చూసుకోవాలంటూ ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారిని స్పెషల్ ఆఫీసర్లుగా పేర్కొంటూ మరో 150 మందిని రూట్ ఆఫీసర్లుగా నియమించుకోవాలని సూచించారు. జనసమీకరణ, తరలింపు, కార్యక్రమ ఏర్పాట్లపై చర్చించేదుకు శనివారం నిర్వహించనున్న సమావేశానికి హాజరు కావాలని నిర్దేశించారు. అయితే డీఈవో జారీ చేసిన ఈ ఉత్తర్వులపై ఉద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జనసమీకరణ బాధ్యతను ప్రభుత్వ ఉపాధ్యాయులకు అప్పగించడమేంటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండిః పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. నేటి రేట్లు ఇలా..