రాజస్థాన్ రాష్ట్రం, ఉదయ్‌పూర్‌లో కన్హయ్య లాల్ అనే టైలర్ని దారుణంగా నరికి చంపిన వారు బీజేపీకి చెందిన కార్యకర్తలే అన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలతో సహా షేర్ అవుతోంది. ఈ అమానుష హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి రియాజ్ అత్తారి, మహ్మద్ గౌస్ అనే ఇద్దరు నిందితులను వెంటనే అరెస్టు చేశారు.
అయితే నిన్ని సిట్ దర్యాప్తులో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. వీరిద్దరూ రాజస్థాన్‌లోని బీజేపీ మైనారిటీ మోర్చాలో కార్యకర్తలుగా ఉన్నారు. స్థానిక బీజేపీ సభ్యులతో కలిసి అట్టారీ ఉన్నటువంటి అనేక ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. పలు పార్టీ కార్యక్రమాలకు కూడా వీరిద్దరు హాజరయినట్టు తెలుస్తోంది.
“ఉదయ్‌పూర్ హంతకుడు బీజేపీకి చెందినవాడు. అయితే ఈ విషయం తెలిసి నేను పెద్దగా ఆశ్చర్యపోలేదు” అని ఒక వ్యక్తి ఫేస్‌బుక్‌లో రాశాడు. అంతేకాకుండా కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ ఎంపీ రేణుకా చౌదరి కూడా ట్విట్టర్‌లో ఇదే వాదనను వినిపించారు. హంతకుడు రియాజ్‌ను బీజేపీ కార్యకర్త అని బీజేపీ మైనారిటీ సెల్ అంగీకరించింది’’ అని ఆమె పోస్ట్ లో తెలిపారు. రేణుకా చౌదరి ట్వీట్ సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద ఎత్తున షేర్ అవుతోంది. అయితే.. రియాజ్ అత్తారి కొన్ని స్థానిక బీజేపీ కార్యక్రమాలకు హాజరైనట్లు కచ్చితమైన సమాచారం ఉందని కొంతమంది చెబుతున్నారు.
అత్తారి అనేక స్థానిక బీజేపీ కార్యక్రమాలకు హాజరయ్యారు. కొన్నిసార్లు ఆహ్వానం లేకుండా కూడా వెళ్లేవాడు. 2019లో మహ్మద్ తాహిర్ అనే వ్యక్తి ఖాతా నుంచి అప్‌లోడ్ చేసిన ఈ ఫొటోలు ఇర్షాద్ చైన్‌వాలా అనే మరో వ్యక్తిని కూడా ట్యాగ్ చేశాయి. ఇక.. చైన్‌వాలా బీజేపీ మైనారిటీ మోర్చా రాజస్థాన్ యూనిట్ సభ్యుడు. దశాబ్ద కాలంగా బీజేపీ సభ్యుడిగా ఉన్న ఉదయపూర్ నివాసి. అత్తారి పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యేవాడని చైన్‌వాలా అంగీకరించాడు. ఉదయపూర్ హత్య నిందితుడు రియాజ్ అత్తారి స్థానిక బీజేపీ కార్యక్రమాలకు హాజరయ్యాడని స్పష్టంగా తెలుస్తోంది.