Wednesday, November 20, 2024

Kamaraj Nadar – నిజాయితీ , నిబద్ధలతోనే పాలనా సామార్ధ్యం ..

(న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి)
గత కొంతకాలంగా భారత ఎన్నికల విధానం పట్ల పార్టీల్లో కొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు గా సుదీర్ఘ కాలం ఉద్యోగాలు చేసి పదవీ విరమణ అనంతరం రాజకీయాల్లోకొస్తే ప్రజాదరణ దక్కుతుందని కొన్ని పార్టీలు భావిస్తున్నాయి. కొన్నయితే ఐఐటీలు, ఐఐఎమ్‌ల పట్టభద్రుల పట్ల ప్రజల్లో ఆకర్షణ ఎక్కువుంటుందని అంచనాలేస్తు న్నాయి. మరికొన్ని అతిపెద్ద వ్యాపార, పారిశ్రామిక సామ్రా జ్యాల్ని సృష్టించిన వ్యక్తుల్ని బరిలోదింపితే ప్రయోజనా లుంటాయని భావిస్తున్నాయి. కాగా ఇటీవల ఏకంగా విదేశాల్లో స్థిరపడ్డ భారతీయ సంతతిని రప్పించి బరిలో దింపితే సొమ్ముకు సొమ్ము, ఓట్లకు ఓట్లు రాలుతాయని, ప్రజాదరణ లభిస్తుందంటూ ఊహల్లో విహరిస్తున్నాయి. కానీ ప్రజలకు మేలు చేయడానికి, ప్రజాసమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించడానికి ఉన్నత విద్యార్హతలు అవసరం లేదు. విదేశాల్లో ఉద్యోగాలు చేసి రావాల్సిన పని లేదు. పెద్దపెద్ద వ్యాపార, పారిశ్రామిక సంస్థల నిర్వహణా నుభవం అసలే అక్కర్లేదు. సాధారణ జీవితం నుంచి జనజీవనంలోకొచ్చిన నిరక్షరాశ్యులు, నిరుపేదలు కూడా దేశాన్ని ప్రగతి పథంవైపు నడిపించారు. పాలకుల పట్ల ప్రజలెట్టుకున్న ఆశల్ని సఫలీకృతం చేశారు. స్వయంగా అత్యంత పేదలైనప్పటికీ ప్రభుత్వాల పరంగా సంపద సృష్టించారు. ఇలాంటి వ్యక్తుల జీవన విధానాల్ని పునశ్చరణ చేసుకోవాల్సిన అవసరం ప్రస్తుత సమయంలో ఉంది.

ఇలాంటి జాబితాలో ప్రముఖులు కామరాజ్‌ నాడార్‌. ఆయన ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచే శారు. లాల్‌బహదూర్‌ శాస్త్రి, ఇందిరాగాంధీలను ప్రధాని పదవిలో కూర్చోబెట్టడంలో కీలకపాత్ర పోషించారు. ఏఐసీసీ అధ్యక్షునిగా పని చేశారు. వీటన్నింటికంటే ముందు సుదీర్ఘ కాలం స్వతంత్ర సమరంలో పాల్గొన్నారు. ఉప్పు సత్యా గ్రహం సమయంలో రెండేళ్ళ జైలు శిక్ష అనుభవించారు. అఖిల భారత కాంగ్రెస్‌ నిర్వీర్యమౌతున్న దశలో తిరిగి దానికి పునరుజ్జీవం పోశారు. ఇందుకోసం ఆయన ప్రవేశపెట్టిన విధానానికి కామరాజ్‌ ఫార్ములాగా గుర్తింపు కొనసాగు తోంది. జాతి సేవలో తరించిన ఆయన వివాహం కూడా చేసుకోలేదు. మరణించే నాటికి ఆయన వద్దనున్నది కేవలం 130రూపాల నగదు మాత్రమే. అంతకుమించి ఆయనకు సొంతిల్లులేదు.. సొంత కారు లేదు. ఏ ఆస్తిపాస్తుల్లేవు. సెంటు భూమిని కూడా ఆయన సంపాదించలేదు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగి ఇద్దరు ప్రధానుల నియామకంలో ప్రధానపాత్ర పోషించిన కామరాజ్‌ నాడార్‌ నిజాయితీకి మారుపేరుగా నిల్చారు. ఇంతకీ ఆయన చదివింది ఆరో తరగతి మాత్రమే. కానీ ముఖ్యమంత్రి అయిన వెంటనే తమిళనాడులో ఒకేసారి 18వేల పాఠశాలలకు శ్రీకారం చుట్టారు. ఆయన ముఖ్య మంత్రయ్యే నాటికి మద్రాస్‌ రాష్ట్రంలో అక్షరాస్యత కేవలం 7శాతం మాత్రమే. ఆయన చొరవతో పదేళ్ళలోనే ఇది 37శాతానికి పెరిగింది.

ప్రస్తుత తమిళనాడులోని విరూద్‌ నగర్‌లో 1903 జులై 15న కుమారస్వామి కామరాజ్‌ నాడర్‌ జన్మించారు. ఆరేళ్ళ వయసులోనే తండ్రి చనిపోవడంతో ఆరో తరగతిలోనే ఆయన పాఠశాల నుండి బయటకొచ్చారు. ఇంటి బాధ్యతల్ని చేపట్టారు. తన మేనమామ సరఫరా దుకాణంలో పని చేయడం మొదలెట్టారు. ఆ సమయంలోనే దేశంలో స్వాతంత్య్ర పోరాటం జోరు పెరిగింది. రోజూ వార్తాపత్రికల ద్వారా అప్పటి రాజకీయ పరిస్థితులపై ఆయన ఆసక్తి పెంచుకున్నారు జలియన్‌ వాలాబాగ్‌ ఊచకోత అతని జీవితంలో నిర్ణయాత్మక మలుపైంది. జాతి స్వేచ్ఛ కోసం పోరాడాలని, దేశంలో విదేశీ పాలనను అంతంచేయాలని నిర్ణయించుకున్నారు. 1920లో 18ఏళ్ళ వయసులోనే పూర్తిస్థాయి రాజకీయాల్లోకొచ్చారు. కాంగ్రెస్‌లో క్రీయాశీలకంగా మారారు. 1921లో విరూద్‌నగర్‌లో కాంగ్రెస్‌ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. 1921 సెప్టెంబర్‌ 21న మహాత్మాగాంధీ మధురైకి వచ్చినప్పుడు కామరాజ్‌ ఆయన్ను స్వయంగా కలిశారు. అప్పటి నుంచి ఆయనపై గాంధీ ప్రభావం అధికమైంది. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ఆయన రెండేళ్ళ జైలు శిక్షకు గురయ్యారు. అయితే ఒక్క ఏడాదిలోనే గాంధీ- ఎర్విన్‌ ఒడంబడిక ఫలితంగా జైలు నుంచి విడుదలయ్యారు.

34ఏళ్ళకే సత్తూరు అసెంబ్లిd నియోజకవర్గం నుంచి విజయం సాధించి 1937లోనే ఆయన అసెంబ్లిdలో ప్రవేశించారు. 1942లో ముంబైలో జరిగిన ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీకి హాజరయ్యారు. క్విట్‌ ఇండియా ఉద్యమానికి ప్రచార సామాగ్రిని రూపొందించారు. అదే ఏడాది ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని మూడేళ్ళు నిర్బంధించారు. ఆయన మొత్తం 3వేల రోజులకు పైగా జైల్లోనే గడిపారు. స్వాతంత్య్రానంతరం 1954 ఏప్రిల్‌ 13న మద్రాస్‌ ప్రావిన్స్‌కు కామరాజ్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ హోదాలో కుటుంబ వృత్తి ఆధారిత వారసత్వ విద్యావిధానాన్ని తొలగించారు. విద్య, వాణిజ్యాల్లో మద్రాస్‌ ప్రావిన్స్‌ను అగ్రగామిగా మార్చారు. తాను చదువుకోకపోయినా రాష్ట్రంలో ప్రజలంతా విద్యావంతులు కావాలని అభిలషించారు. ఏ కుటుంబానికైనా మూడు కిలోమీటర్ల లోపు దూరంలో పాఠశాలుండాలని నిర్ణయించారు. ఇందుకోసం ఏకంగా 18వేల పాఠశాలలను నిర్మించారు.

లక్షలాదిమంది పేద బడి పిల్లలకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆయన కాలంలో భారీ నీటిపారుదల పథకాల్ని రూపొందించారు. కోటి 50లక్షల ఎకరాల భూముల్ని అదనంగా సాగులోకి తెచ్చారు. అప్పటి తమిళనాట కాగితం, చక్కెర, రసాయనాలు, సిమెంట్‌ పరిశ్రమల్ని ఏర్పాటు చేశారు. వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
1964లో నెహ్రూ మరణానంతరం కల్లోల పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను ముందుకు నడిపించారు. నెహ్రూ అనంతరం ప్రధానమంత్రయ్యే అవకాశం ఆయనకొచ్చింది. కానీ అందుకాయన నిరాకరించారు. లాల్‌బహదూర్‌ను ప్రధాని గా ప్రతిపాదించారు. శాస్త్రి మరణానంతరం ఇందిరాగాంధీకి పగ్గాలు అప్పగించడంలో కీలకపాత్ర పోషించారు. అప్పటి నుంచి ఆయన ఇండియాలో కింగ్‌మేకర్‌గా పేరొందారు. ముఖ్యమంత్రిగా ప్రభుత్వం అందించిన భద్రతను నాడార్‌ నిరాకరించారు. ఒకే పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనంతో ప్రయా ణించారు. విరూద్‌నగర్‌లోని తన నివాసానికి పురపాలక సంఘం ఏర్పాటు చేసిన నీటి కనెక్షన్‌ను కూడా ఆయన వద్ద న్నారు. పదేళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన నాడార్‌ జీవితంలో ఎలాంటి అవినీతి మచ్చాలేదు. ఆయన వివాహం కూడా చేసుకోలేదు. సొంతంగా ఆస్తి సంపాదించుకోలేదు. 1972లో మరణానంతరం ఆయనకు భారత అత్యున్నత పౌరపుస్కరం భారతరత్నను ప్రకటించారు. ఇప్పటికీ తమిళనాట ఆయన్ను విద్యా పితామహుడిగా ఆరాధిస్తారు.

- Advertisement -

నాడార్‌ రాజకీయ, సామాజిక పాలన దురంధతలను పరిశీలిస్తే సమాజ సేవకు లేదా పాలనకు చదువుతో సంబంధంలేదు. ఆస్తిపాస్తులతో పనిలేదు. కుటుంబ వారసత్వం అక్కర్లేదు. కావల్సిందల్లా నిజాయితీ, నిబద్దత, సామర్థ్యం మాత్రమేనని వెల్లడౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement