భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు విశ్వ నటుడు కమల్ హాసన్. నటన నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన శనివారం ఢిల్లీలో రాహుల్ గాంధీతో కలిసి కొంత దూరం నడిచారు. ‘భారత్ జోడో యాత్ర’కు ఈ మేరకు తన సంఘీభావాన్ని ప్రకటించారు. ఇప్పటికే పలువురు నటులు, ప్రముఖులు రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొన్నారు. కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పటికే 3,000 కిలోమీటర్ల దూరం కవర్ అయ్యింది. మరో 12 రాష్ట్రాల మీదుగా ఈ యాత్ర సాగి జనవరి చివర్లో జమ్ముకశ్మీర్‌లో ముగియనున్నది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా శనివారం రెండోసారి ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్నారు.
ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ, అల్లుడు రాబర్ట్ వాద్రా, మనవళ్లు, మనవరాళ్లు, పలువురు కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా రాహుల్‌తో కలిసి నడిచారు. అయితే సోనియా గాంధీ కుటుంబం అంతా ఈ యాత్రలో పాల్గొనడం ఇదే తొలిసారి. అక్టోబర్‌లో కర్ణాటకలోకి ప్రవేశించిన ఈ యాత్రలో సోనియా గాంధీ తొలిసారి పాల్గొన్నారు.మరోవైపు ‘ఆమె (సోనియా) నుంచి నాకు లభించిన ప్రేమను, దేశంతో పంచుకుంటున్నాను’ అని రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు. తన తల్లిని కౌగిలించుకున్న ఫొటోను అందులో పోస్ట్ చేశారు.