కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో అంతర్జాతీయ కళోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రముఖ గాయని ఓల్లాల వాణి.. ‘ఏ తల్లి పిల్లాడో..’ అంటూ ముఖ్యమంత్రి రాష్ట్రానికి చేసిన సేవలను కీర్తిస్తూ గీతం ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ ఫేమ్ శివజ్యోతి (సావిత్రి) సభను ప్రారంభించారు. ముఖ్యఅతిథులుగా హాజరైన తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, మేయర్ వై సునీల్ రావు, కలెక్టర్ ఆర్వీ కర్జన్, డిప్యూటీ కలెక్టర్లు శ్యాంప్రసాద్ లాల్ , గరిమా అగర్వాల్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేశారు.
అనంతరం ఆరు నిమిషాల పాటు సాగిన క్రాకర్ షో జిల్లా వాసులకు కనువిందు చేసింది. జిల్లాకు చెందిన కళాకారులు మిట్లపల్లి సురేందర్, మధుప్రియ, మౌనిక యాదవ్, బుల్లెట్ భాస్కర్, నరేశ్, జోగుల వెంకటేశ్, శ్రీకాంత్, చంద్రవ్వ, కొమురవ్వలను పరిచయం చేశారు. ప్రారంభం సూచకంగా జిల్లా కేంద్రానికి చెందిన సంగెం రాధాకృష్ణ బృందం చేసిన తమ బతుకమ్మ నృత్యం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమానికి సినీ తారులు తరుణ్, శ్రీకాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం ఇజ్రాయిల్, అండమాన్ నికోబార్‌కు చెందిన కళాకారు నృత్యాలు అలరించాయి.