Friday, November 22, 2024

TS | కాళేశ్వరంతో చుక్కనీరు రాలే.. అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ

పెద్దపల్లి, (ప్రభ న్యూస్) : బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించామని గొప్పలు చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క చుక్క నీరు కూడా పారడం లేదని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క ఆరోపించారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా మంగళవారం రాత్రి పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు. లక్ష 25 వేల కోట్ల ప్రజాధనం కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట సీఎం కేసీఆర్ వృధా చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పై సమగ్ర విచారణ జరుపుతామన్నారు.

రైతులకు ఒకే దఫాలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, సింగరేణిని కాపాడుతాం అన్నారు భట్టి విక్రమార్క. నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేస్తామని అప్పటివరకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టిస్తామని, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కొనసాగిస్తామన్నారు. రైతు బంధువులు మాదిరిగా కూలీ బంద్ ఏర్పాటుచేసి ప్రతి ఒక్క కూలి కుటుంబానికి ఏడాదికి 12 వేల రూపాయలు అందిస్తామన్నారు.

నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసమే ఏర్పాటైన తెలంగాణలో అవేమీ సాధ్యం కావడం లేదన్నారు. రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పుల మయంగా మార్చారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దించాలని, భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని
కూలదోయాలని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ఇప్పటివరకు 345 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నామన్నారు. రాష్ట్ర వనరులను కెసిఆర్ కుటుంబం దోచుకుంటుందన్నారు. ఆదివాసీలు అనాధలయ్యారని, గోల్డ్ మహిళలు భూములు కోల్పోయామని కన్నీరు పెడుతున్నారన్నారు. ఇందిరమ్మ రాజ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

- Advertisement -

ఏఐసీసీ కార్యదర్శి మంత్రి శాసనసభ్యుడు శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పేపర్ లీక్ తో వేలాదిమంది నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ గృహాలు అందిస్తామన్నారు. దళిత బంధు ప్రతి కుటుంబానికి అందించాలని డిమాండ్ చేశారు. ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మక్కాన్ సింగ్, జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్, మాజీ శాసనసభ్యుడు విజయ రమణారావు, ఓదెల జడ్పిటిసి గంట రాములు, అన్నయ్య గౌడ్ తో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement