Saturday, November 23, 2024

కాకతీయుల శిల్పకళా నైపుణ్యం.. మళ్లీ అదే స్టైల్

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్: ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రీశుని ఆలయాన్ని భక్తజనావళికి కనువిందుగొలిపేలా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, అద్భుతమైన కళాఖండాలతో శిల్పులు నిర్మించారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనకు ప్రతిరూపంగా వాస్తుశిల్పులు, స్థపతులు ఆధ్యాత్మితకు అద్దం పట్టేలా పూర్తిస్థాయి రాతి దేవాలయ నిర్మాణాన్ని పూర్తిచేశారు. వచ్చే ఏడాది మార్చి 28న పున:ప్రారంభించనున్న యాదాద్రి దేవాలయం పాంచరాత్ర ఆగమ, వాస్తు శాస్త్రాల ప్రకారం ఆలయ విస్తరణ, అభివృద్ధి జరుగుతోంది. ఆధారశిల నుంచి గోపురం పైవరకు ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి కృష్ణశిలతో యాదాద్రి ఆలయ నిర్మాణం జరిగింది. గర్భాలయాన్ని తాకకుండా, ప్రధానాలయాన్ని విస్త‌రించారు. పాత ఆలయం విధంగానే ముఖమండపం రాజ ప్రాసాదాన్ని తలపిస్తుంది. 2016లో యాదాద్రి ప్రధానాలయ పునర్నిర్మాణ పనులకు కేసీఆర్‌ పూజలు చేయగా.. ఐదేళ్లలో ఆలయాన్ని పూర్తిస్థాయిలో నిర్మించి భక్తులకు స్వయంభూ దర్శనాలు కల్పించే దిశగా పనులు పూర్తయ్యాయి.

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణానికి సుమారు రెండు లక్షల టన్నుల కృష్ణశిలను ఉపయోగించారు. ఈ రాయిని ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా గురిజేపల్లి, గుంటూరు జిల్లా కమ్మకారిపాలెం నుంచి తీసుకువచ్చారు. ఈ రెండు జిల్లాల మధ్యలో ఉన్న 20కి.మీ.ల స్థలంలోని భూమిలో ఈ రాయిని సేకరించారు. శ్రీరంగం ఆలయం మాదిరిగానే యాదాద్రి ఆలయం కూడా నల్లరాతి శిలతో నిర్మాణం జరిగింది. కృష్ణశిలగా ప్రసిద్ధి చెందిన నల్లరాయి ఎండా కాలంలో చల్లదనాన్ని, చలికాలంలో వెచ్చదనాన్ని ఇస్తుంది. అత్యంత కఠినమైన శిల కావడం వల్ల ఎక్కువ కాలం ఆలయం పటిష్ఠంగా ఉంటుంది.

యాదాద్రీశుడి ప్రధానాలయ పునర్నిర్మాణాన్ని అద్భుతంగా తీర్చి దిద్దడానికి వైటీడీఏ అధికారులు, ఆర్కిటెక్ట్‌లు, శిల్పులు దేశంలోని పలు ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించి వాటి నిర్మాణ శైలిని పరిశీలించారు. ఈ దేవాలయ నిర్మాణ శైలిలో పల్లవ ఏనుగులు, కాకతీయ స్తంభాలు, చాళుక్య ఉప పీఠాలు, హొయాసాల శిల్పరీతులు ప్రతిబింబిస్తాయి. తెలంగాణ కాకతీయ శిల్పకళా రీతులకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ ప్రధానాలయంలో కాకతీయ స్తంభాలను, పడమర రిటైనింగ్‌ వాల్‌లో ఎలిఫెంట్‌ ప్యానల్‌ను తీర్చిదిద్దారు. యాదాద్రి పున:నిర్మాణంలో భాగంగా ప్రధాన స్థపతితో పాటు పదకొండు మంది ఉపస్థపతులు, రెండువేల మంది శిల్పులు మొదటి సంవత్సరం పనిచేయగా, తరువాతి సంవత్సరం పదిహేను వందల మంది శిల్పులు విధులు నిర్వహించారు. ఈ శిల్పుల్లో తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, తమిళ నాడు రాష్ట్రాల వారున్నారు.

వందేళ్ళ ముందు నిర్మించిన అనుభూతి భక్తులకు కలిగే విధంగా రాతి కట్టడాలతో యాదాద్రి ఆలయ నిర్మాణం జరిగింది. పాత ఆలయం చుట్టూ సిమెంట్‌ కట్టడాలను విడతలుగా చేపట్టారు. గర్భాలయాన్ని అలాగే ఉంచి దాని చూట్టూ పటిష్ఠమైన గోడ నిర్మించారు. ఆలయంలోకి భక్తులు సులువుగా వెళ్లేందుకు వీలుగా ముఖ ద్వారాన్ని వెడల్పుచేశారు. దక్షిణం దిక్కున 120 అడుగుల రిటైనింగ్‌ వాల్‌ నిర్మించి ఆలయానికి దక్షిణ భాగంలో స్థలం పెంచారు. గర్భాలయాన్ని మధ్యగా లెక్కిస్తూ పూర్తి ఆలయ నిర్మాణం చేపట్టారు. గతంలో పదివేల మంది భక్తులకు వీలుండే చోటును ప్రస్తుతం ముప్పై నుంచి నలభై వేల మంది వచ్చి పోయేందుకు వీలుగా విస్తరించారు. చుట్టూ ప్రాకార, అష్టభుజి మండపాలు నిర్మించారు. ప్రధానాలయంలో గతంలో ఉన్న విధంగానే ధ్వజస్తంభం, బలిపీఠం, గరుడ ఆలయం, ఆండాళ అమ్మవారు, ఆంజనేయస్వామి ఆలయాలున్నాయి. ఇందులో అదనంగా సేనా మండపం, అళ్వార్‌, రామానుజుల ఉపాలయాలను నిర్మించారు. తూర్పు ద్వారంగుండా ఆలయంలోకి భక్తులు వచ్చి, పడమడి రాజగోపురం నుంచి వెళ్లే మార్గంలో రాతి మెట్లకు రాతి రెయిలింగ్‌ను ఏర్పాటు చేయడం విశేషం.

పురాతన కాలంలో డంగు సున్నం, కరక్కాయ, బెల్లం, కలబంద, జనపనారలను సరైన పాళ్లలో కలిపి జిగట మిశ్రమం చేసి రాతి కట్టడాలలో ఉపయోగించేవారు. నాటి సాంప్రదాయ శైలిని యాదాద్రి ప్రధానాలయ రాతి కట్టడాల్లో ఉపయోగించారు. రాతి లాకింగ్‌ విధానానికి అదనంగా జిగట మిశ్రమం ఉపయోగించడంతో వందలఏళ్లపాటు ఆలయాలు పటిష్ఠంగా ఉన్నాయని నేటి యాదాద్రి పునర్నిర్మాణంలో వీటిని ఉపయాగించారు. భూకంపాలను తట్టుకునేలా ఈ జిగట మిశ్రమం ఎంతో గట్టిగా ఉంటుందని శిల్పులు అంటున్నారు. ఈ రాతి లాకింగ్‌ నిర్మాణంలో ఎక్కడా సిమెంట్‌, కాంక్రీట్‌ వాడలేదు.

- Advertisement -

ప్రధానాలయం తర్వాత అత్యంత శిల్ప సంపద కలిగిన రెండో ప్రాకారం భక్తులను ఆధ్యాత్మిక భక్తి పారవశ్యాన్ని కలిగిస్తుంది. ప్రధానాలయ నిర్మాణంలో ప్రత్యేకంగా తీర్చి దిద్దిన ఏడు రాజగోపురాలు వేటికవే ప్రత్యేకతలను సంతరించుకు న్నాయి. పూర్తిగా వైష్ణవ సంప్రదాయాలతో రాతి కట్టడాలపై భక్తిరసభావాన్ని మేళవించారు. ఏడు రాజగోపురాల ఎత్తు వివిధ అడుగుల్లో తీర్చిదిద్దారు. రెండో ప్రాకార మండపంలో తిరుమాడ వీధుల వైపు 58 యాలి స్తంభాలు, మరో వైపు అష్ట భుజి ప్రాకార మండపాన్ని ఆధ్యాత్మిక భక్తి భావం పెంపొందించేలా రూపొందించారు. పడమర వైపున గల సప్తతల రాజగోపురం ఎత్తు 85 అడుగులు. గోపుర నిర్మాణానికి వాడిన కృష్ణ శిలల బరువు 7,630 టన్నులు, స్వామి వారి గర్బాలయంపై గల దివ్యవిమానం ఎత్తు 41.1 అడుగులు.

దీనికి వాడిన కృష్ణశిలల బరువు 25,000 టన్నులు. తూర్పు, ఉత్తరం, దక్షిణ దిశలలోని పంచతల రాజగోపురాల ఎత్తు 57 అడుగులు, ఒక్కో రాజగోపురానికి వాడిన రాతి శిలలు మూడు వేల టన్నులు, పడమర పంచతల రాజగోపురానికి మాత్రం 3,150 టన్నుల రాయిని వాడారు. స్వామివారు ఊరేగింపు సందర్భంగా కొద్ది సేపు సేద తీరడానికి ఏర్పాటు చేసిన వేంచేపు మండపం ఎత్తు 39 అడుగులు. బ్రహ్మోత్సవ మండపం ఎత్తు 33 అడుగులు. కొండపైన స్వామివారి విష్ణు పుష్కరిణిని 28.09 అడుగుల్లో తీర్చిదిద్దారు. గర్భగుడిలోకే వెళ్లే తూర్పు ద్వారం వద్ద, ప్రధానాలయం ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన రెండేసి ఏనుగుల విగ్రహాల ఎత్తు 7.2 అడుగులు. ద్వారపాలకుల విగ్రహాలను 10.3 అడుగుల ఎత్తులో తయారు చేశారు.

తూర్పు రాజగోపురం నుంచి ప్రధానాలయంలోకి వెళ్లే మార్గంలో శిల్పులు అద్భుతమైన శిల్పాలను చెక్కారు. ఆలయంలో ఇరువైపులా గోడలకు శంఖుచక్ర నామాలు, ఏనుగుల వరుసలు, గరుత్మంతుడు, ఆంజనేయస్వామి, సుదర్శన మూర్తి, యోగ నారసింహుడు, గర్భాలయ గోడకు పంచ నారసింహ రూపాలు, పడమర ద్వారానికి ఇరువైపులా చండప్రచండ విగ్రహాలు ఏర్పాటు చేశారు.

యాదాద్రీశుడి ఆలయంలో సుమారు నలభై అడుగుల ఎత్తు ఉన్న ధ్వజస్తంభాన్ని తీసుకువచ్చారు. దీనిని ములుగు జిల్లా ఏటూరునాగారం ప్రాంతంలోని టేకు వృక్షం నుంచి తీసుకువచ్చారు. దీనికి రాగి, బంగారు తొడుగులు అమరుస్తున్నారు. శ్రీ పర్వత వర్ధని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని శిల్పులు అద్భుతంగా తీర్చిదద్దారు. ప్రధానాలయంతో పాటు అమ్మవారి ఆలయాలను కృష్ణశిలతో నిర్మించారు. మూడంతస్తుల రాజగోపుర శిఖరంవరకు కృష్ణశిలతో నిర్మించారు. మూలమూర్తులున్న మహా మండపాన్ని పదహారు స్తంభాలతో నిర్మించారు. నల్లరాతితో ఫ్లోరింగ్‌ చేశారు. మహా మండపం ఎదురుగా మహాబలిపురం నుంచి తీసుకొచ్చిన ఆరడుగుల నంది విగ్రహాన్ని నెలకొల్పారు.

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement