హుజురాబాద్ ఉప ఎన్నికల వేడి పెంచుతోంది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. అయితే, అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇంకా తమ పార్టీ అభ్యర్థి ఎవరు అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. పార్టీ తరుపున ఎవరిని నిలబెట్టాలి అనేదానిపై తర్జనబర్జన పడుతోంది. టీఆర్‌ఎస్ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో త్వరలో ఉప ఎన్నిక రాబోతోంది. ఈ ఎన్నికను ప్రస్తుతం అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాజీనామా అనంతరం బీజేపీలో చేరిన ఈటల కమలం గుర్తు మీద పోటీ చేయనున్నారు. ఇక, గత ఎన్నికల్లో ఈటలపై ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ టికెట్టు ఆశించినట్లు ప్రచారం జరిగినా.. ఇటీవల పీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలవడంతో కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తారనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. అయితే, అధికార టీఆర్‌ఎస్ నుంచి అభ్యర్థి ఎవరనే విషయంలో స్పష్టత రావడం లేదు. అయితే అభ్యర్థి విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ వ్యూహత్మక అడుగులు వేస్తున్నారు.
అభ్యర్థి ఎంపిక కోసం ఇప్పటికే పలు మార్లు సీఎం కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నేతలతో సమావేశం అయ్యారు. ఈ క్రమంలో అనూహ్యంగా మాజీ మంత్రి కడియం శ్రీహరి పేరు తెరపైకి వచ్చింది. హుజురాబాద్ టికెట్ విషయంలో ఎస్సీ వర్గానికి చెందిన కడియం శ్రీహరి పేరును సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న సుమారు 40 వేల ఎస్సీ ఓట్లు ఉప ఎన్నికలో కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వర్గంపై కేసీఆర్ ఫక్షస్ పెట్టారు. ఈ ఉప ఎన్నికలో గెలిచే అభ్యర్థికి మంత్రి పదవి కూడా ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఉప ఎన్నికలో బీజేపీ తరఫున బరిలో ఉన్న ఈటల రాజేందర్ బీసీల్లో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారు. దీంతో బీసీ వర్గాల ఓట్లు ఈటలకే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ సామాజిక కోణంలో ఆలోచించి.. ఎస్‌సీ వర్గానికి ప్రాతినిథ్యం కల్పించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. దళితులకు ప్రత్యేక నిధుల కేటాయింపు, దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్ విషయంలో సీఎం స్పందన, ఇతర పరిణామాలు హుజురాబాద్‌లో కొత్త రాజకీయ సమీకరణాలపై ఆసక్తిని రేపుతోంది. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గానికి చెందిన అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
కేసీఆర్ తొలి ప్రభుత్వంలో లక్కీగా కడియం శ్రీహరి ఎస్సీ కోటాలో ఏకంగా ఉపముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే బలమైన నాయకుడిగా పేరు పొందారు. టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్ – కడియం కలిసి పనిచేశారు. అయితే అంత సాన్నిహిత్యం ఉన్నా కూడా గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కడియంను పూర్తిగా పక్కన పడేశారు కేసీఆర్. కడియం కోరిన స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ టికెట్ ను ఇవ్వలేదు. పైగా లైంగిక – తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న రాజయ్యకే టికెట్ ఇవ్వడం కడియం వర్గాన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. దీంతో అప్పటి నుంచి ముభావంగా ఉంటూ పార్టీ వ్యవహారాలు, కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కడియం శ్రీహరి… తాజాగా తన స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని అనుచరులతో రహస్యంగా భేటి అవుతున్నారు. ఈ క్రమంలో శ్రీహరి హుజురాబాద్ బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది.
ఇది కూడా చదవండి: వాటర్ వార్.. ప్రధాని మోదీకి ఏపీ సీఎం లేఖ